Decision of the Authorities to Demolish the Building: సికింద్రాబాద్ నల్లగుట్టలో అగ్నిప్రమాదానికి గురైన భవనాన్ని ఆధునిక సాంకేతికత ఉపయోగించి కూల్చాలని అధికారులు నిర్ణయించారు. కూల్చివేత సమయంలో పరిసర ప్రాంతాల్లోని భవనాలు దెబ్బతినకుండా ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. నిన్న భవనంలో ఒక వ్యక్తి అస్థిపంజరం అగ్నిమాపక సిబ్బంది గుర్తించారు. దానిలో చిక్కుకున్న మరో ఇద్దరి యువకుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. బాధితుల ఆనవాళ్లు దొరికిన తర్వాతే భవనాన్ని కూల్చివేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.
అసలేం జరిగింది: సికింద్రాబాద్ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ డెక్కన్ మాల్ భవనంలో ఒక మృతదేహాన్ని నిన్న అధికారులు గుర్తించారు. మృతదేహం అవశేషాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాంధీ ఆసుపత్రి మార్చురికి తరలించారు. మృతదేహాన్ని గుర్తించేందుకు వైద్యులు డీఎన్ఏ పరీక్ష చేయనున్నారు. అగ్ని ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ఆచూకీ లేకుండా పోయారు. వారిని వసీం, జహీర్, జునేద్ అని అధికారులు తెలిపారు.
ప్రస్తుతం దొరికిన మృతదేహాం ఎవరిది అని తేల్చేందుకు.. ముగ్గురి కుటుంబ సభ్యుల నుంచి డీఎన్ఏ సేకరించనున్నారు. ఫలితాలు రాగానే సరిపోల్చనున్నారు. అగ్నికీలలు, దట్టమైన పొగ వల్ల.. మృతదేహాల గుర్తింపు ఆలస్యమైంది. భవనం మొదటి అంతస్తులో ప్రస్తుతం ఒక మృతదేహం ఆనవాళ్లను అగ్నిమాపక సిబ్బంది గుర్తించారు. మంటలు చెలరేగిన సమయంలో దుకాణంలో ఉన్న తమ వస్తువులు తెచ్చుకునేందుకు ముగ్గురు లోపలికి వెళ్లారని ఇతర సిబ్బంది వెల్లడించారు.
ఈ నేపథ్యంలో అగ్నిప్రమాదంలో ముగ్గురూ చనిపోయి ఉంటారని భావించగా.. తాజాగా ఒకరి మృతదేహాం ఆనవాళ్లు లభ్యమయ్యాయి. కనిపించకుండా పోయిన మిగతా ఇద్దరి జాడ కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆరంతస్తుల డెక్కన్ స్పోర్ట్స్ భవనంలో మంటలు ఎగసిపడ్డాయి. భవనం నలువైపుల నుంచి అగ్నికీలలు ఎగిసిపడగా.. చుట్టూ మొత్తం పొగ అలుముకుంటోంది. ఇప్పటివరకూ భవనంలో చిక్కుకున్న ఐదుగురిని సిబ్బంది రక్షించారు. 22 ఫైరింజన్లతో మంటలార్పారు. ఎట్టకేలకు మంటలు చల్లారాయి.
ఇవీ చదవండి: