ఓ ప్రైవేటు వసతి గృహంలో యువకుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన సంఘటన హైదరాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమిళనాడుకు చెందిన కేశవ ప్రసాద్ అనే వ్యక్తి రెజిమెంటల్ బజార్లోని జేఎంజే హాస్టల్లో గత 8 నెలలుగా ఉంటున్నాడు. 2 రోజుల క్రితం మధ్యాహ్న భోజన సమయంలో హాస్టల్ వారితో కలిసి భోజనం చేసిన అనంతరం కనపడలేదు.
నిన్న భోజన సమయం, రాత్రి సమయాల్లో కూడా అతను కనపడకపోయేసరికి హాస్టల్ యజమానులకు అనుమానం వచ్చి అతని రూమ్ని తెరవడానికి ప్రయత్నించారు. లోపలినుంచి తాళాలు వేసి ఉండటం వల్ల.. హాస్టల్ యాజమాన్యం తలుపులు బద్దలుకొట్టారు. గదిలో అప్పటికే ఆ యువకుడు చనిపోయి ఉన్నాడు. యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు... మృతికి గల కారణాలను విచారిస్తున్నారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి: మల్కాజిగిరిలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య