Madhuranagar street dog bite : హైదరాబాద్ గచ్చిబౌలి డివిజన్ మధురానగర్లో ఓ వీధి కుక్క స్వైర విహారం చేసింది. కాలనీలో రోడ్డుపై తిరిగే పిల్లలను గాయపరిచింది. గురువారం సాయంత్రం గంట వ్యవధిలో దాదాపు 18 మందిపైన దాడి చేసింది. కుక్క దాడితో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కుక్క దాడిలో చిన్నారులూ ఉన్నారు. దాడిలో తీవ్రంగా గాయపడిన 11 ఏళ్ల చిన్నారి అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. కుక్క గురువారం సాయంత్రం స్వైర విహారం చేయడంతో శుక్రవారం ఉదయం నుంచి దానిని పట్టుకోవడానికి జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం వరకు వెతికినా కుక్క దొరకలేదు.
నేను ఫోన్ ఇవ్వడానికి పోయినా. ఆ కుక్క వచ్చి నా చేయి కరిచింది. -బాధితుడు
మా పిల్లలు కొనుక్కోవడానికి దుకాణానికి వెళ్లారు. మా కాలనీ నుంచి పక్క కాలనీలోకి వెళ్లారు. ఆ కుక్క వాళ్ల మీదకు దూకి తీవ్రంగా గాయపరిచింది. రెండు చేతులపై కుక్క కాట్లు ఉన్నాయి. కండ మొత్తం బయటకు వచ్చింది. మా బాబు ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మా మేనకోడళ్లు ఇద్దరినీ కరిచింది. ఆ తర్వాత వేరే అమ్మాయిని కూడా కరిచింది. - ఓ చిన్నారి తల్లి
పిల్లలను కరిచింది. దాన్ని కొడదామని నేను పోయేలోపు నన్ను కూడా కరిచింది. ఈ కాలనీలో దాదాపు 30 మంది పిల్లలు ఆడుకుంటారు. రోజూ సైకిళ్లు తొక్కుతారు. ఆ కుక్క రోజూ ఇక్కడే తిరుగుతుంది. మొత్తం 18 మందిని ఆ కుక్క కరిచింది. ఓ పాపకు సీరియస్గా ఉంది. చేతి నరం కట్ అవడంతో సర్జరీ చేశారు.
-బాధితుడు
స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. తక్షణమే ఆ కుక్కను పట్టుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. కుక్క కాటుకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
ఇదీ చదవండి: ChamalaValasa Tractor Accident : ట్రాక్టర్ బోల్తా.. 22 మందికి గాయాలు.. ఆరుగురి పరిస్థితి విషమం