రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవులలోని ఓ ఫామ్‌హౌస్‌లో పేకాట నిర్వహణపై(SOT police hyderabad) దర్యాప్తు కొనసాగుతోంది. ఫామ్‌హౌస్‌ను ఓ సినీ హీరో తండ్రి అద్దెకు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పుట్టినరోజు వేడుకల కోసం సుమన్ అనే వ్యక్తికి హీరో తండ్రి ఆదివారం ఇచ్చినట్లు వెల్లడించారు. సుమన్‌పై హైదరాబాద్, బెంగళూరులో గేమింగ్ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఆదివారం రాత్రి ఫామ్‌హౌస్‌లో ఎస్‌వోటీ పోలీసుల దాడులు నిర్వహించారు. ఫామ్‌హౌస్‌లో సుమన్ సహా పేకాడుతున్న 30మందిని అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లో పేకాటరాయుళ్లను రిమాండ్‌కు తరలించనున్నట్లు పోలీసులు వివరించారు.
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవుల గ్రీన్‌ల్యాండ్స్‌లోని ఓ భవనంలో నడుస్తున్న ఓ పేకాట శిబిరంపై ఆదివారం సైబరాబాద్ పోలీసులు(SOT police hyderabad) దాడి చేసి 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. రూ.6.70 లక్షలు, 33 చరవాణులు, 3 కార్లు సీజ్ చేశారు. ఈ మేరకు సమాచారం అందుకున్న మాదాపూర్ ఎస్‌ఓటీ పోలీసులు(SOT police hyderabad) ఆదివారం సాయంత్రం మంచిరేవుల గ్రీన్‌ల్యాండ్స్‌లోని భవనంపై దాడులు చేశారు. ఈ భవనం ఓ యువ హీరోకు చెందినదిగా కలకలం రేగినా, తర్వాత ఆ హీరో తండ్రి సినిమా షూటింగ్ కోసం అద్దెకు తీసుకున్నట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. వారికి తెలిసిన ఓ వ్యక్తి పార్టీ చేసుకునేందుకు భవనాన్ని తీసుకున్నట్లు గుర్తించారు. నిందితుల్లో ప్రముఖులు ఉన్నట్లు తెలిసింది.
ఇదీ చదవండి: Ganja Smuggling: గంజాయి దారులు మూసేలా .. పోలీసు, ఎక్సైజ్ శాఖల వ్యూహం!