SIT Enquiry on MLA Bribing Case: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) వేట కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్ అరెస్టయి జ్యుడిషియల్ కస్టడీలో ఉండటంతో మిగిలిన కీలక ఆధారాల సేకరణలో సిట్ నిమగ్నమైంది. ఈక్రమంలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేరళ, కర్ణాటక, హరియాణాల్లో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
SIT Enquiry on MLA Poaching Case : ముఖ్యంగా ఈకేసులో రామచంద్రభారతి కీలకంగా మారడంతో అతనికి సంబంధించిన సమాచారాన్ని రాబట్టడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఆయన నివాసమున్న హరియాణాలోని ఫరీదాబాద్ ఇంట్లో ఇప్పటికే సోదాలు చేసింది. అయితే ఫరీదాబాద్ కంటే ఎక్కువగా కేరళలో సోదాలపై గురి పెట్టడం చర్చనీయాంశంగా మారింది. కేరళలోని కొచ్చిలో ఆది, సోమవారాల్లో సోదాలు చేసిన సిట్ బృందం.. మంగళవారం కొల్లాంలో వేట మొదలుపెట్టింది.
SIT Enquiry on MLA Buying Case : రామచంద్రభారతి నుంచి దర్యాప్తును ముందుకు తీసుకెళ్లడంలో అక్కడ లభించే సమాచారమే కీలకమవుతుందని సిట్ భావిస్తున్న నేపథ్యంలో కేరళలో మకాం వేసింది. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో గత నెల 26న తెరాస ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతూ పోలీసుల స్టింగ్ ఆపరేషన్‌కు దొరికిన సమయంలో రామచంద్రభారతి కేరళకు చెందిన తుషార్‌తో ఫోన్‌లో మాట్లాడటంతో.. తుషార్ పాత్ర తేల్చడం కేసులో కీలకంగా మారింది.
అయితే తుషార్‌ను కేసులో నిందితుడిగా చేర్చేందుకు ఇంకా బలమైన ఆధారాలు సేకరించాలనే భావనతో సిట్ ఉన్నట్లు సమాచారం. అందుకే తుషార్‌ను రామచంద్ర భారతికి పరిచయం చేసిన కేరళ వైద్యుడు జగ్గుస్వామిని అదుపులోకి తీసుకొని విచారించడమే తక్షణ కర్తవ్యంగా సిట్ ముందుకెళ్తోంది. అతడి కోసమే సోమవారం కొచ్చిలో వేట సాగించిన సిట్ బృందం.. మంగళవారం కొల్లాంలో సోదాలు చేపట్టినట్లు సమాచారం.
ఓవైపు జగ్గుస్వామిని అదుపులోకి తీసుకునట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఈ కేసుతో సంబంధమున్న మరికొందరి కోసమే కొల్లాంలో సిట్ సోదాలు నిర్వహించిందని తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ పోలీసుల సోదాలను పసిగట్టి జగ్గుస్వామి పారిపోవడంతోనే కొల్లాంలో అతడి కోసం వెతికిందనే వాదన వినిపించింది.
ఇవీ చదవండి: