సికింద్రాబాద్‌లోని రూబీ లాడ్జి అగ్నిప్రమాద ఘటనలో ఇప్పటి వరకు రంజిత్ సింగ్, సునీత్ సింగ్, సుదర్శన్, జస్పాల్ సింగ్‌లను అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. మరో నిందితుడు సుప్రీత్ సింగ్ పరారీలో ఉన్నట్టు చెప్పారు. రంజిత్ సింగ్ పేరుతో లాడ్జి భవనం ఉంది. ఆయన కుమారులు సునీత్ సింగ్, సుప్రీత్ సింగ్ అని పోలీసులు వివరించారు. లాడ్జి, ఈ-బైక్ వ్యాపారాలను సునీత్, సుప్రీత్ చూసుకుంటున్నారు.
ఘటనాస్థలిని పరిశీలించిన అధికారులు: ఈ-బైక్‌కు ఛార్జింగ్ పెట్టడంతో దాని నుంచి మంటలు వెలువడినట్టు పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో సెల్లార్‌లో 28 ఈ-బైక్‌లు, 8 ద్విచక్రవాహనాలు, 4 ఎల్పీజీ సిలిండర్లు ఉన్నాయి. సెల్లార్‌లో ఉన్న 4 సిలిండర్లను పై అంతస్తులో ఉన్న వంటగదికి పైపుల ద్వారా అనుసంధానం చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. సికింద్రాబాద్‌లోని రూబీ లాడ్జిను అగ్నిప్రమాద ఘటనపై పోలీస్ ట్రాన్స్‌పోర్టు అధికారి రాజేశ్ విచారణ చేపట్టారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి..అగ్నిమాపక సిబ్బంది, అధికారులను అడిగి వివరాలు సేకరించారు. సెల్లార్‌లో అగ్నిప్రమాదంలో దగ్ధమైన ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన ఫొటోలు, విజువల్స్ సేకరించి తీసుకెళ్లారు. ఘటనకు సంబంధించిన నివేదికను తయారుచేసి ఉన్నతాధికారులకు అందించేందుకే పోలీస్ ట్రాన్స్‌పోర్టు అధికారి రూబీ హోటల్‌కు వచ్చినట్టు స్థానిక పోలీసులు తెలిపారు. అనంతరం స్థానిక పోలీసులు హోటల్ మేనేజర్ సుదర్శన్ నాయుడును హోటల్‌లోనే విచారించారు.
సోమవారం రాత్రి 9 గంటల సమయంలో రూబీ ఎలక్ట్రిక్ బైక్ షో రూమ్‌ను మూసేసి రాజేందర్ సింగ్‌తో పాటు కుమారుడు సునీత్ సింగ్ కార్ఖానాలోని ఇంటికి వెళ్లారు. 9 గంటల 45నిమిషాల సమయంలో అగ్ని ప్రమాదం గురించి లాడ్జిలో పనిచేసే సిబ్బంది, యజమాని రాజేందర్‌సింగ్‌కు తెలిపారు. వెంటనే ఘటనా స్థలానికి వచ్చినప్పటికి మరణాల విషయం తెలుసుకోగానే అక్కడి నుంచి కిషన్‌బాగ్ పారిపోయి బంధువుల ఇంట్లో తలదాచుకున్నారు. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ భవన యజమాని, రూబీ ఎలక్ట్రిక్ బైక్ షోరూం యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాజేందర్‌సింగ్‌కు ఇద్దరు కుమారులు. వీరిలో సునీత్ సింగ్ ఎలక్ట్రిక్ బైక్‌ల షోరూమ్ నిర్వహిస్తుండగా... తండ్రి రాజేందర్ సింగ్, మరో కుమారుడు సుప్రీత్ సింగ్ కలిసి లాడ్జిని నిర్వహిస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే లాడ్జిని సీజ్ చేశారు.
అసలేం జరిగిందంటే: సికింద్రాబాద్‌లోని రూబీ లాడ్జి ఐదు అంతస్తుల భవనంలో కొనసాగుతోంది. మొదటి అంతస్తులో ఫైనాన్స్ సంస్థ, రిసెప్షన్ విభాగాలున్నాయి. తర్వాతి అంతస్తుల్లోని 25 గదులను అద్దెకు ఇస్తున్నారు. వాహన పార్కింగ్‌కు కేటాయించిన సెల్లార్‌లో విద్యుత్ ద్విచక్రవాహనాల షోరూం నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన 25 మంది 1-2 రోజులు ఉండేందుకు ఈ లాడ్జిలో బస చేశారు. సోమవారం రాత్రి 9.17 గంటలకు సెల్లార్‌లో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది. క్షణాల్లో అగ్నికీలలు వ్యాపించి.. వాహనాలన్నీ కాలిపోయాయి. వాహనాలు, టైర్లు కాలటంతో దట్టమైన పొగ వ్యాపించింది. రెప్పపాటులో ఐదంతస్తుల్లో ఉన్న గదులను పొగ చుట్టుముట్టి లోపలున్న వారిని ఉక్కిరిబిక్కిరి చేసింది. పొగ ధాటికి తట్టుకోలేక ముగ్గురు అక్కడికక్కడే మరణించగా.. ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఇవీ చదవండి: సికింద్రాబాద్ అగ్నిప్రమాదం.. ఎలక్ట్రిక్ వాహనాలే కారణం
మంటల్లో నుంచి బయటపడలేక పోతున్నాం.. చివరిసారిగా కుటుంబంతో సికింద్రాబాద్ ఘటన మృతులు