పెద్దపల్లి జిల్లా మంథనిలో న్యాయవాద దంపతుల హత్యకు ఉపయోగించిన ఆయుధాలు ఎట్టకేలకు లభ్యమయ్యాయి. సుందిళ్ల బ్యారేజీలోని 53వ పిల్లర్ వద్ద రెండు కత్తులు దొరికాయి. వామన్ రావు, నాగమణిని హతమార్చేందుకు ఉపయోగించిన కొడవళ్లను సుందిళ్ల బ్యారేజీలో పడేసినట్లు నిందితులు కస్టడీలో తెలిపారు.
ఎట్టకేలకు దొరికాయి..
ఈ మేరకు పోలీసులు రెండో రోజులుగా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఏపీ నుంచి వచ్చిన గజ ఈతగాళ్లు... సుందిళ్ల బ్యారేజీలో 25 ఫీట్ల లోతులోకి వెళ్లి కొడవళ్ల కోసం వెతికారు. ఆదివారం ఆయుధాలు దొరకకపోవటంతో ఇవాళ కూడా గాలింపు కొనసాగింది. నిందితులను బ్యారేజీ వద్దకు తీసుకొచ్చి... మరింత సమాచారం సేకరించారు. 48వ పిల్లర్ నుంచి 60వ పిల్లర్ మధ్యలో ఆయుధాలు పడేసినట్లు నిందితులు తెలిపారు. వాటిని స్వాధీనం చేసుకునేందుకు అయస్కాంతాలు, డ్రోన్ కెమెరాలు, బోట్ల సహాయంతో గాలించారు. 53వ పిల్లర్ వద్ద రెండు కత్తులు కొద్దిపాటి దూరంలోనే లభించాయి. హత్య జరిగిన 13 రోజుల తర్వాత దొరికిన రెండు ఆయుధాలకు పంచనామ నిర్వహించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వారికి భద్రత..
దుస్తులు కూడా అక్కడే పడేసినట్లు నిందితులు చెప్పినప్పటికీ.. అవి మాత్రం దొరకలేదని పోలీసులు వెల్లడించారు. మృతుని తండ్రి వామనరావుతో పాటు సోదరుడు ఇంద్రశేఖర్‌కు పోలీసులు భద్రత కల్పించారు. గుంజపడుగు గ్రామంలో పోలీస్ పికెటింగ్, పెట్రోలింగ్ కొనసాగిస్తున్నట్లు సీపీ సత్యనారాయణ తెలిపారు. ఇనుముల సతీష్‌కు భద్రత ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని... కానీ అతను అందుబాటులోకి రాలేదని వెల్లడించారు.
ఇదీ చూడండి: ఇంటి ఓనర్‌కు నిప్పంటించిన అద్దెదారు- చిన్నారి మృతి