ఎంపీ, ఎమ్మెల్యేల నకిలీ లెటర్ హెడ్లు తయారు చేసి వీఐపీ, ఎమర్జెన్సీ కోటాలో రైల్వే టికెట్లు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న ముఠాను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది గుర్తించి అందులో ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నారని ఆర్పీఎఫ్ పోలీసులు తెలిపారు. నిందితుడు దిలీప్ నాయక్‌ను పోలీసులు విచారించగా... అతడికి ముఖేష్ చౌహాన్‌తో పరిచయం ఉందని.. అతడే ప్రధాన సూత్రధారి అని దిలీప్ తెలిపాడు. దిలీప్ ఇచ్చిన సమాచారంతో ముఖేష్ షాపుపై ఆర్పీఎఫ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఎమర్జెన్సీ కోటాకు గోవా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఒడిశా, కేరళ తదితర రాష్ట్రాలకు చెందిన 9 మంది ఎంపీ, ఎమ్మెల్యేల లెటర్ హెడ్ల నుంచి ఎక్కువ సార్లు రిక్వెస్ట్ రావడంతో అనుమానం వచ్చిన రైల్వే శాఖ అధికారులు ఆర్పీఎఫ్ పోలీలసుకు సమాచారం అందించారు.
రంగంలోకి దిగిన ఆర్పీఎఫ్ పోలీసులు విచారణ చేపట్టగా.. దిలీప్ నాయక్ పట్టుబడ్డాడు. దిలీప్ నాయక్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. ముఖేష్ వివరాలు వెల్లడించారు. ముఖేష్ చౌహాన్ ఐడీఏ బొల్లారంలో అనధికారికంగా రైల్వే టికెట్ బుకింగ్ నిర్వహిస్తున్నాడని.. ముఖేష్ నుంచి రూ.1,66,476లు విలువ గల 84 టికెట్లను స్వాధీనం చేసుకున్నామని ఆర్పీఎఫ్ పోలీసులు తెలిపారు. ముఖేష్ అంతర్జాలం నుంచి వివిధ ప్రాంతాలకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేల లెటర్ హెడ్లను డౌన్లోడ్ చేసుకుని వాటిని వీఐపీ కోటా కింద బుక్ చేసుకునేందుకు వినియోగించేవాడని పోలీసుల విచారణలో తేలింది. ప్రయాణికులు ఇటువంటి వారిని నమ్మి మోసపోవద్దని రైల్వేశాఖ విజ్ఞప్తి చేస్తోంది.
ఇదీ చదవండి: విశాఖ: నిర్మాణంలో ఉన్న వంతెన కూలి ఇద్దరు మృతి