మెదక్ జిల్లాలో వ్యాపారి ధర్మాకర్ శ్రీనివాస్‌ను కారులో దహనం చేసిన కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు సంబంధించిన వివరాలను మెదక్ ఎస్పీ చందన దీప్తి వెల్లడించారు. సాంకేతిక ఆధారాల సాయంతో ఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితులను గుర్తించినట్టు ఎస్పీ తెలిపారు. వ్యాపారి శ్రీనివాస్ గొంతు కోసి చంపినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైందని వివరించారు. ఆధారాలు లభించకుడాదని భావించిన నిందితులు.. చనిపోయిన తర్వాత మృతదేహాన్ని కారులో పెట్టి దగ్ధం చేసినట్లు తెలిపారు. శ్రీనివాస్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన శివను అరెస్టు చేశామని.. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు.
అన్ని కోణాల్లో దర్యాప్తు...
"హత్యకు కారణం మాత్రం పూర్తిగా నిర్ధరణ కాలేదు. వ్యాపార లావాదేవీలు, పాతకక్షలు, వివాహేతర సంబంధం లాంటి పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. పూర్తి ఆధారాలు లభించిన తర్వాతే అసలు కారణమేంటనేది కచ్చితంగా చెప్తాం. శ్రీనివాస్ గొంతు కోసి చంపినట్లు పోస్టుమార్టం రిపోర్టులో ఉంది. చనిపోయిన తర్వాత మృతదేహాన్ని కారులో పెట్టి దగ్ధం చేశారు. ఈ హత్య కేసులో ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఎంత మందికి ప్రమేయం ఉన్నా.. వదిలిపెట్టం. అందరికీ చట్టపరంగా శిక్షపడేలా చేస్తాం. ప్రధానంగా ముగ్గరికి మాత్రం నేరుగా ప్రమేయం ఉన్నట్టు మా దర్యాప్తులో తేలింది. అందులో ఒకరే శివ. అతన్ని అరెస్టు చేసి విచారిస్తున్నాం. వ్యాపార లావాదేవీల కారణంగానే చంపినట్టు శివ చెబుతున్నాడు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. వాళ్లను కూడా త్వరలోనే పట్టుకుంటాం. కేసును లోతుగా దర్యాప్తు చేశాక.. సాక్ష్యాధారాలతో పూర్తి వివరాలు తెలియజేస్తాం." - చందన దీప్తి, ఎస్పీ.
తన భర్తకు ఇతర మహిళలతో సంబంధాలు ఉన్నాయని, తరచూ తనతో గొడవ పడేవారని మృతిచెందిన వ్యాపారి శ్రీనివాస్ భార్య నిన్న పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పలువురితో స్థిరాస్తి వ్యాపార లావాదేవీల్లోనూ గొడవలు జరుగుతున్నాయని కూడా ఆమె చెప్పారు. ఈ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. శ్రీనివాస్ మృతదేహం పూర్తిగా కాలిపోయి ఉండటంతో కృత్రిమ దంతాల ఆధారంగా కారులోని మృతదేహం శ్రీనివాస్‌దే అని నిన్న ఆయన కుటుంబ సభ్యులు గుర్తించిన విషయం తెలిసిందే.
ఇవీ చూడండి: