Honey Trap Gang Arrest in Hyderabad : హైదరాబాద్‌లో వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని వలపు వల విసిరి దోపిడీకి పాల్పడుతున్న ముఠాను ముషీరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి లక్షన్నర రూపాయల నగదు, మూడు ద్విచక్రవాహనాలు, పది కత్తులు, రెండు డమ్మీ తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో 10 మంది పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారని... మరో మహిళ పరారిలో ఉన్నట్లు వెల్లడించారు. అయితే ఈ ముఠాలోని మహిళలు.. బడా వ్యాపారవేత్తల నంబర్లు సేకరించి వారిని ఏకాంతంగా కలిసేందుకు హోటళ్లకు వచ్చేలా ప్రేరేపిస్తారు.
వారు గదిలోకి రాగానే మాటలు కలిపి నగ్నంగా మారమంటూ రెచ్చగొట్టి ఫోటోలు, వీడియోలు తీసుకుంటారు. ఇంతలోనే మిగతా ముఠా సభ్యులు గదిలోకి వచ్చి తన భార్యను లోబరుచుకున్నావని ఒకరు, తన సోదరిని తీసుకొచ్చావని మరోకరు ఆ వ్యాపారితో గొడవ పడి కత్తులు, డమ్మీ తుపాకులతో బెదిరిస్తారు. పోలీసులమని, రిపోర్టర్లమని నకిలీ ఐడి కార్డులు చూపించి డబ్బులు లాక్కుంటారు. ఈ ముఠా ఇప్పటివరకు ఇలా పలువురిని బెదిరించి 8 లక్షల 50 వేల రూపాయలు వసూలు చేసినట్లు డీసీపీ రాజేష్ చంద్ర తెలిపారు.
'బడా వ్యాపారుల నంబర్లు సేకరించి హోటళ్లకు వచ్చేలా మహిళలు ప్రేరేపిస్తారు. వాళ్లు అక్కడికి వచ్చాక ఫొటోలు సేకరించి బెదిరింపు చర్యలకు పాల్పడతారు. వ్యాపారులు మహిళలతో ఉన్న సమయంలో ముఠా సభ్యులు గదిలోకి ప్రవేశిస్తారు. డమ్మీ తుపాకులతో బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు' - రాజేశ్ చంద్ర, డీసీపీ
ఈ ముఠాలో ప్రధాన నిందితుడు మహమ్మద్ వికార్ మెహిది గతంలో హోంగార్డుగా పనిచేసేవాడు. ఇతనిపై పలు స్టేషన్లలో అక్రమ కార్యకలాపాలకు సంబంధించి కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో 2010లో అతడ్ని ఉద్యోగం నుంచి తొలగించారు. అప్పటి నుంచి తేలికగా డబ్బులు సంపాదించేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన 9 మంది పురుషులు, ముగ్గురు మహిళలతో కలిసి ముఠాగా ఏర్పడ్డారు.
గతేడాది మార్చ్ నుంచి హనీ ట్రాప్ దందాకు పాల్పడుతున్నారు. ముషీరాబాద్‌కు చెందిన వ్యాపారి నుంచి 5 లక్షలు, ఏక్ మినార్‌కు చెందిన వ్యాపారి నుంచి రెండున్నర లక్షలు, సంతోష్ నగర్‌కు చెందిన మరో వ్యాపారి నుంచి లక్ష రూపాయలు వసూలు చేశారు. ఇలాంటి మహిళ అపరిచితులతో అప్రమత్తంగా ఉండాలని, ఎవరైన వీరివల్ల నష్టపోయిన బాధితులు తమకు ఫిర్యాదు చేయాలని డీసీపీ రాజేష్ చంద్ర తెలిపారు.
ఇవీ చదవండి: