Visakhapatnam Juvenile Home Girls Issue : మత్తుమాత్రలు ఇచ్చి మానసిక రోగులుగా మారుస్తున్నారంటూ జువెనైల్ బాలికలు నిరసనకు దిగారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ నగరం విశాలాక్షినగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే నగరంలోని ప్రభుత్వ ప్రత్యేక బాలికల సదనం, పరిశీలన గృహంలోని ఐదుగులు బాలికలు రక్షణ గోడుపైనున్న ఇనుప కంచె దాటుకుని మరీ రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపైకి రాళ్లు, సిమెంటు రేకులు విసిరారు. 'మాకు నరకం చూపిస్తున్నారు, మత్తుమాత్రలు ఇచ్చి మానసిక రోగులుగా మారుస్తున్నారు. మాకు న్యాయం చేసి మా ఇళ్లకు పంపండి' అంటూ రోడ్డుపై ఉన్నవారికి దండం పెడుతూ అభ్యర్థించారు.
కన్నపిల్లలను ఎక్కడైన అమ్ముకుంటారా : ఈ విషయం తెలుసుకున్న ఏసీపీ నరసింహమూర్తి, సీఐ మల్లేశ్వరరావు, చినగదిలి తహసీల్దార్ పాల్‌కిరణ్ అక్కడికి చేరుకున్నారు. బాలికలకు సర్దిచెప్పి జువైనల్ హోంకు తరలించారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ బాలిక తల్లి సైతం తమ కుమార్తెను ఇంటికి పంపించకుండా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 'నా బిడ్డను ఇవ్వమంటే నాకు ఇవ్వట్లేదు, నువ్వు పిల్లలను అమ్మేసుకుంటావ్ అంటున్నారు. ఏ కన్నతల్లైనా తన పిల్లలను అమ్మేస్తుందా?' అని కన్నీరు పెట్టుకున్నారు.
విశాలాక్షినగర్‌లోని జువెనైల్ హోంలో 8-18 ఏళ్ల బాలికలు 60 మంది వరకు ఉండగా వారి పర్యవేక్షణకు 25 మంది సిబ్బంది ఉన్నారు. గత మూడు రోజులుగా కొందరు బాలికలు తామిక్కడ ఉండలేమని, కుటుంబ సభ్యులకు అప్పగించాలని ఆందోళన చేస్తున్నారు. కాగా మూడేళ్ల క్రితం శ్రీకాకుళం, గోదావరి జిల్లాలు, గుంటూరు, కృష్ణా, హైదరాబాద్‌కు చెందిన వారిని ఈ గృహంలో చేర్పించారు. వీరిలో కొందరు బుధవారం గోడ దూకి బయటకు రాగా వారిని సిబ్బంది గమనించలేదు.
నిజమైని తేలితే కఠిన చర్యలు : ఈ ఘటనపై మంత్రి అనిత స్పందించి, నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ, కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌తో ఫోన్లో మాట్లాడారు. బాలికల ఆరోపణలపై ఆరా తీశారు. మహిళా పోలీస్ అధికారి, తహసీల్దార్ నేతృత్వంలో బాలికలతో మాట్లాడించి వివరాలు తెలుసుకోవాలని, వారు చేసిన ఆరోపణలు నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వారిని పర్యవేక్షణలో పెట్టాం : ఈ ఘటనపై జువెనైల్ హోం పర్యవేక్షకురాలు ఏవీ సునీత మాట్లాడారు. ఐదుగురు బాలికలు గత రెండు రోజులుగా ఇబ్బంది పెడుతున్నారని పోలీల్ స్టేషన్ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వారి మానసిక పరిస్థితి బాగోలేదని, వారంలో రెండు సార్లు వారికి చికిత్స చేయిస్తున్నట్లు చెప్పారు. మాత్రలు మింగకుండా, భోజనం చేయకుండా, గట్టిగా అరుస్తూ, చేతులపై రాళ్లతో కోసుకుంటూ ఇబ్బంది పెడుతున్నారని వివరించారు. వారి పరిస్థితి ఎప్పటికప్పుడు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ దృష్టికి తీసుకెళ్తున్నామన్న ఆమె, కమిటీ నిర్ణయం మేరకే వారిని కుటుంబ సభ్యులతో పంపిస్తామని స్పష్టం చేశారు.
"జువెనైల్ హోంలో ఉన్న ముగ్గురు పిల్లలు మా దగ్గర మానసిక ఆరోగ్యానికి మందులు వాడుతున్నారు. ఉదయం నుంచి హోం వద్ద అంబులెన్స్, సిబ్బందిని పెట్టాం కానీ ఆసుపత్రిలో ఎవరూ చేరలేదు." - డాక్టర్ కేవీ రామిరెడ్డి, ప్రభుత్వ మానసిక వైద్యశాల సూపరింటెండెంట్
ఇన్స్టాగ్రాం ద్వారా పరిచయమైన అబ్బాయిలను కలిసేందుకు తొమ్మిదో తరగతి అమ్మాయిల ప్లాన్
అమ్మాయిలూ.. ఇలాంటి వాళ్లతో జాగ్రత్త - మనోళ్లే అనుకుంటే ముప్పే! - Girls Safety Awareness