ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒకే ఇంట్లో ఆరుహత్యలు. వాళ్లలో ఇద్దరు చిన్నారులు. ఇళ్లంతా రక్తపుమడుగు.. చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు. మెుదట ఆస్తితగాదాలే అనుకున్నారంతా.. కానీ లోతుగా వివరాలు ఆరా తీస్తే.. ఈ ఆరుహత్యలకు కారణం.. గతంలో జరిగిన అత్యాచారమే అని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా పెందుర్తి మండలం జుత్తాడలో తెల్లవారుజామున ఓ ఇంట్లోంచి ఒక్కసారిగా కేకలు. చూస్తూ ఉండగానే ఇల్లంతా రక్తపు మడుగు. చిన్నపిల్లలు, ఆడవాళ్లు అని కూడా చూడకుండా ఏకంగా ఆరుగురిని హత్య చేశాడు బత్తిన అప్పలరాజు. బొమ్మిడి రమణ (63), బొమ్మిడి ఉషారాణి (35), అల్లు రమాదేవి (53), నక్కెళ్ల అరుణ (37), ఉషారాణి పిల్లలు బొమ్మిడి ఉదయ్ (2), బొమ్మిడి ఉర్విష (6 నెలలు) అంతా రక్తపు మడుగుల్లో ప్రాణాలు వదిలారు. ఒక్కసారిగా విషయం తెలిసిన జుత్తాడ గ్రామం ఉలిక్కిపడింది.
అయితే ఈ హత్యలు పాత కక్షల నేపథ్యంలో జరిగాయి అనుకున్నారంతా. నిందితుడు పెందుర్తి పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. మెుదట విచారణ చేస్తుంటే.. అసలు విషయం తెలియలేదు. కానీ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తుంటే షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. ఇప్పుడే కాదు అప్పలరాజు ఓ హత్యాయత్నం కేసులో 2012లోనూ నిందితుడిగా ఉన్నాడు. 2018లోనూ పెందుర్తి పోలీస్ స్టేషన్లో మరో కేసు కూడా నమోదైంది.
అసలు కారణం ఇదే..
నిందితుడు అప్పలరాజుకు ఓ కుమార్తె (20) ఉంది. ఆమెను బొమ్మిడి విజయ్ మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశాడు. అలా ఎనిమిది నెలలు ఘోరానికి పాల్పడ్డాడు. ఈ విషయం విజయ్ భార్య ఉషారాణికి తెలిసినా ఫొటోలను చూపించి బాధితురాలినే బ్లాక్ మెయిల్ చేసేది. 2018లో జరిగిన ఈ ఘటనపై అప్పట్లో పెందుర్తి స్టేషన్లో కేసు రిజిస్టర్ చేశారు. అది విచారణలో ఉంది. ఆ కుటుంబం వల్ల తనకు అన్యాయం జరిగిందని అప్పలరాజు కక్ష పెంచుకున్నాడు. తన కుమార్తె జీవితం నాశనమైందని ఎలాగైనా ఆ కుటుంబాన్ని అంతమెుందించాలని అనుకున్నాడు.
సమయం కోసం వేచి చూసి...
ఆ మరుసటి రోజు 2018 ఏప్రిల్ 10న తన భర్త(బొమ్మిడి విజయ్)ను హతమారుస్తానని బత్తిన అప్పలరాజు, శ్రీను, గౌరీష్, సన్యాసిలు బెదిరించారని బొమ్మిడి ఉషారాణి పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి ఇంకా.. కక్ష పెంచుకున్న బత్తిన అప్పలరాజు సమయం కోసం వేచి చూశాడు. ఇవాళ ఉదయం ఆరు గంటలకు వేట కొడవలితో ఆరుగురిని హత్య చేశాడు. ఆ కుటుంబం వల్లే తన కుమార్తె జీవితం నాశనమైందని కోపంతో ఇదంతా చేసినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: రాళ్లు, సీసాలతో కొట్టి.. దారుణంగా చంపేసి..