సంగారెడ్డి జిల్లా కలెక్టర్ నుంచి గత సంవత్సరం ఉత్తమ గ్రామ కార్యదర్శిగా పురస్కారం పొందిన వ్యక్తి...ఉద్యోగం చేయలేకపోతున్నానంటూ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నారు. అధికారులు సహకరించకపోవడం, ఇన్‌ఛార్జి సర్పంచి తీరే అందుకు కారణమని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం మిన్పూర్ గ్రామ కార్యదర్శి జగన్నాథ్ (26) బుధవారం ఆయన స్వగ్రామం ఇసోజిపేటలో ఉరివేసుకుని తనువు చాలించారు. ఎస్సై నాగలక్ష్మి కథనం ప్రకారం.. మిన్పూర్ గ్రామాభివృద్ధిలో భాగంగా చేపట్టిన కొన్ని పనులకు జగన్నాథ్ సుమారు రూ. 35 వేల సొంత డబ్బును ఖర్చు చేశారు. ఆ డబ్బును తిరిగి ఇవ్వడంలో, ఇతర బిల్లుల విషయంలో ఇన్‌ఛార్జి సర్పంచి తనను ఇబ్బంది పెడుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఎంపీడీఓ మధులత, ఏపీఓ స్వాతిలకు విన్నవించినా ప్రయోజనం లేకపోయిందని వాపోయారు.
‘‘తమ్ముడూ.. అమ్మానాన్నలకు మనమే ప్రపంచం. వాళ్లను బాగా చూసుకో. నాకు బతకాలనే ఉన్నా.. ఇలాబతకడం నావల్ల కావడం లేదు. నా మరణాన్ని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తమకున్న సమస్యల్లో ఏదో ఒక సమస్య పరిష్కారానికి వాడుకోవాలి’’ అని జగన్నాథ్ ఆ లేఖలో కోరారు. తమ కుటుంబానికి అప్పుల సమస్య ఉందని అందరూ ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
రాజీనామా వద్దని నచ్చచెప్పాం...
‘జగన్నాథ్ విధి నిర్వహణలో చురుకుగా ఉండేవారు. ఉద్యోగంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులతో ఇటీవల రాజీనామా చేయగా.. చిన్న వయసులో ఎందుకిలా చేస్తావంటూ ఎంపీడీవో, నేను సర్దిచెప్పడంతో మళ్లీ విధులకు హాజరవుతున్నారు. ఇంత ఆకస్మికంగా ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం వచ్చిందో తెలియట్లేదు. బిల్లుల విషయం మాకు చెప్పలేదు. చెబితే ఇప్పించే వాళ్లం’ అని ఏపీవో స్వాతి వివరించారు. పంచాయతీలో చేసిన పనులకు సంబంధించి రూ. 3 లక్షలు బిల్లులు రావాల్సి ఉందని, ఈ బిల్లుల విషయంలో ఆర్నెల్ల క్రితం జగన్నాథ్‌ను అడిగానని మిన్పూర్ ఇన్‌ఛార్జి సర్పంచి మాణెమ్మ వివరించారు.
ఇదీ చూడండి: కృష్ణా ట్రైబ్యూనల్‌లో విచారణ... మాజీ ఛైర్మన్‌కు క్రాస్ ఎగ్జామినేషన్