బతుకు దెరువు కోసం నేపాల్ నుంచి వలస వచ్చి.. నమ్మకంగా ఓ ఇంట్లో పనికి కుదిరి అన్నం పెట్టిన ఇంటికే కన్నం పెట్టింది ఓ ముఠా. ఏడాది కిందట రాయదుర్గం పీఎస్ పరిధిలో భారీ దొంగతనానికి పాల్పడిన ఈ గ్యాంగ్(NEPAL GANG) మళ్లీ అదే తరహాలో అదే పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీకి పాల్పడింది. దాదాపు 65 లక్షల విలువైన సొత్తును దొంగిలించి పరారైంది.
ఇతరులను పనిలో పెట్టి
హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని గచ్చిబౌలి టెలికాం నగర్లో నివసించే గోవిందరావు ఇంట్లో కొన్ని నెలల కిందట ఓ వ్యక్తి పనిలో చేరాడు. కొంత కాలం పనిచేసిన తర్వాత.. తాను ఊరికి వెళ్తున్నానని, తిరిగి వచ్చేవరకు తమ బంధువులను పనిలో పెట్టుకోవాలని కోరాడు. గోవిందరావు సరే అనడంతో అలా అతని బంధువులు లక్ష్మణ్, పవిత్ర దంపతులు నాలుగు నెలలుగా ఆ ఇంట్లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారు. వారి వద్ద నమ్మకం సంపాదించారు. ఊరెళ్లి వస్తానని చెప్పిన మనిషి ఇంకా రాకపోవడంతో గోవిందరావు వీరినే కొనసాగించారు.
అదను చూసి
ఈ క్రమంలో గోవిందరావు.. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం దర్శనానికి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన నేపాల్ దంపతులు ఇంటి కిటీకీ తొలగించి లోపలికి ప్రవేశించారు. బెడ్రూమ్ తలుపు పగులగొట్టి లాకర్లోని రూ. 10 లక్షల నగదు, 110 తులాల బంగారంతో పరారయ్యారు. శ్రీశైలంలో ఉన్న గోవిందరావు.. లక్ష్మణ్‌కు ఫోన్ చేయడంతో అతని ఫోన్ స్విచాఫ్ వచ్చింది. దీంతో అనుమానం వ్యక్తం చేసిన యజమాని వెంటనే ఇంటికి చేరారు. ఇంట్లో వాచ్మెన్ కనపడకపోవడం, నగదు, బంగారం లేకపోవడంతో దొంగతనం జరిగిందని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. నమ్మకంగా ఇంట్లో పనిచేసిన వ్యక్తులు ఇలా చోరీకి పాల్పడతారని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ ముఠా.?
విలాసవంతమైన ఇళ్లే లక్ష్యంగా...
నేపాల్‌లోని ఏడు ప్రావిన్సుల్లో సుదూర పశ్చిమ ప్రదేశ్ ఒకటి. ఈ ప్రావిన్స్‌లోని కైలాలీతో మరో మూడు, నాలుగు జిల్లాల్లో ఈ దొంగల ముఠాలుంటాయి. నలుగురైదుగురు కలిసి ముఠాగా ఏర్పడతారు. ముఠా సభ్యులు ఒక్కో నగరంలో ఒక్కో ఇంట్లో పనికి చేరతారు. వీరంతా ఫేస్బుక్ మెసెంజర్, వైబర్ తదితర సామాజిక మాధ్యమాల్లోనే మాట్లాడుకుంటారు. లూథియానా, నోయిడా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ తదితర మెట్రో నగరాల్లోని విలాసవంతమైన ఇళ్లల్లో పనికి కుదురుతారు. నమ్మకంగా పనిచేస్తారు. కుటుంబ సభ్యులు, ఇంటికి సంబంధించిన సమాచారం సేకరిస్తారు.
అసలు దొంగ అప్పుడే దిగుతాడు...
అకస్మాత్తుగా పని మానేస్తారు. ఎందుకని యజమాని అడిగితే ఊర్లో అత్యవసర పని ఉందని, మళ్లీ తిరిగి రాలేనంటూ స్పష్టం చేస్తారు. లేదంటే మరికొద్ది రోజుల్లో వస్తానని చెప్పి.. మీకు ఇబ్బంది లేకుండా నా స్థానంలో మా బంధువును పనికి కుదుర్చుతానంటూ చెబుతారు. ఆ పేరు మీద అసలు దొంగను రంగంలోకి దింపుతారు. ఇంట్లో అంతకు ముందు పని చేసిన ముఠా సభ్యుడు అసలు దొంగకు పూర్తి సమాచారమిస్తాడు. దాని ఆధారంగా ఆ దొంగ సందర్భం చూసి ఆహారంలో మత్తు మందు కలపడం లేదా.. వారు తాళాలేసి ఊరెళ్లిన సందర్భం చూసి ఉన్నదంతా సర్దేస్తారు. ఆ తర్వాత ఫోన్ స్విచాఫ్ చేరి పరారవుతారు.
పోలీసులు చేరుకోలేని స్థలాల్లో ఇళ్లు...
చోరీ తర్వాత ముఠా సభ్యులంతా సొత్తును సమంగా పంచుకుంటారు. బంగారు ఆభరణాలను ముక్కలుగా పగులగొడతారు. ఒక్కరు దొరికినా మిగిలిన వారు పట్టపడకుండా ఎవరి దారిన వాళ్లు నేపాల్‌కు చేరుకుంటారు. దొంగిలించిన సొత్తును చాలా తక్కువ ధరకే విక్రయిస్తారు. ఆ డబ్బులతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఈ దొంగలకు రెండు ఇళ్లుంటాయి. ఊరిలో ఒకటి, గుట్టలపై ఒకటి. పోలీసులు వచ్చినట్లు సమాచారం రాగానే గుట్టలపై ఉన్న ఇళ్లకు చేరుకుంటారు. అక్కడికి చేరుకోవాలంటే కనీసం 5 గంటల నుంచి 7 గంటల వరకు నడవాల్సి ఉంటుంది. పై నుంచి పోలీసుల రాకపోకలను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉండి అప్రమత్తవుతారు.
సంబంధిత కథనాలు: సినిమా కథను మించిన థ్రిల్లర్ స్టోరీ... నేపాల్ గ్యాంగ్ చోరీల మిస్టరీ