Drugs mafia accused arrested: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల పోలీసులు గాలిస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ సరఫరాదారుడు టోనీని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న టోనీ ముఠా సభ్యులను గతవారం పట్టుకున్న పోలీసులు.. కాల్ లిస్ట్ ఆధారంగా టోనీని ముంబయిలో అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 10గ్రాముల కొకైన్, రెండు చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. వారం రోజుల నుంచి ముంబయిలో మకాం వేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. అక్కడి పోలీసుల సాయంతో అదుపులోకి తీసుకున్నారు. టోనీతో పాటు నగరంలో ఇతని వద్ద నుంచి మత్తుమందులు కొంటున్న 9 మందిని అరెస్ట్ చేశారు. వీరంతా సంపన్నులని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. అరెస్ట్ వివరాలను సీపీ మీడియాకు వెల్లడించారు.
వ్యాపారవేత్తలకు సరఫరా
చాకచక్యంగా ముంబయిలో టోనీని అరెస్ట్ చేసిన పోలీసులు... హైదరాబాద్ తీసుకొచ్చారు. డ్రగ్స్ సరఫరాకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సహా అన్ని ప్రధాన నగరాల్లో ప్రత్యేకంగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నాడని సీపీ తెలిపారు. హైదరాబాద్‌లో పలువురు ప్రముఖులకు టోనీ గ్యాంగ్ డ్రగ్స్ సరఫరా చేసిందని వెల్లడించారు.
2013లో తాత్కాలిక వీసాపై ముంబయికి వచ్చిన టోనీ.. వీసా గడువు ముగిసినా నగరంలో ఉంటూ డ్రగ్స్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. టోనీకి స్టార్‌య్ అనే అంతర్జాతీయ డీలర్.. ఓడల ద్వారా సరుకు పంపిస్తున్నట్లు గుర్తించాం. వాటిని ప్రధాన నగరాలకు సరఫరా చేస్తున్నాడు. నగరంలో 13 మంది ప్రముఖులకు ఈ డ్రగ్స్‌ను విక్రయించారు. రూ.వెయ్యి కోట్ల వ్యాపారం చేసే నిరంజన్ జైన్ సైతం డ్రగ్స్ తీసుకున్నారు. నిరంజన్ జైన్ 30 సార్లు డ్రగ్స్ తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. చాకచక్యంగా వ్యవహరించి టోనీతో పాటు 9 మందిని అరెస్టు చేశాం. --- సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
వారిపై కూడా కేసులు
డ్రగ్స్ విక్రయదారులపైనే కాకుండా వినియోగిస్తున్న వారిపై కూడా కేసులు పెడుతున్నామని సీపీ ఆనంద్ అన్నారు. న్యాయ నిపుణుల సలహాతోనే కేసులు పెడుతున్నామని.. ఇంకా ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా చేశారో దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. సినీ ప్రముఖులతో టోనీకి సంబంధాలు ఉన్నట్లు ఇంకా తేలలేదని సీవీ ఆనంద్ వెల్లడించారు.
ఇదీ చదవండి: సాఫ్ట్వేర్ ఉద్యోగిని గుంటూరులో అదృశ్యం.. విజయవాడలో విగతజీవిగా...