Mother Suicide attempt: పోషణ విషయంలో కన్న బిడ్డలే ఈసడించడం తల్లి ప్రాణం మీదికి తెచ్చిన విషాదమిది. చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ ఎన్.శ్రీనివాస్ కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం జైకేసారాం గ్రామానికి చెందిన బోదాసు స్వామి, ఆండాళు దంపతులకు ఇద్దరు కుమారులు నాగరాజు, రవి. పెద్ద కుమారుడు నాగరాజు రాళ్లు పగలగొట్టి జీవనం సాగిస్తుంటాడు. చిన్నవాడైన రవి లారీ డ్రైవరుగా పనిచేస్తూ వేరే ఊళ్లో నివసిస్తున్నాడు. తల్లిదండ్రుల పోషణ విషయంలో వీరిద్దరూ తరచూ తగాదా పడేవారు. పెద్దకుమారుడు తాగి వచ్చి ఘర్షణకు దిగేవాడు. ఒకటి రెండుసార్లు ఇంట్లోంచి గెంటివేశాడు. పలుమార్లు ఊళ్లో పెద్దలు పంచాయితీ పెట్టి మందలించినా అతడి తీరు మారలేదు. మంగళవారం రాత్రి మరోసారి ఇలా జరగడంతో ఆవేదన చెందిన ఆండాళు బుధవారం ఉదయం ఈ వేధింపులు తట్టుకోలేకపోతున్నానని.. చనిపోతానంటూ రోడ్డు మీదకు వచ్చి ఆవేదన చెందడంతో సర్పంచి తదితరులు నచ్చజెప్పి పోలీసులకు ఫిర్యాదు చేయమని సూచించారు.
దీంతో ఆమె చౌటుప్పల్ పోలీసులకు ఆశ్రయించారు. వారు ఇద్దరు కుమారులను స్టేషన్‌కు పిలిపించి విచారించారు. అప్పటి వరకు అక్కడే ఉన్న ఆండాళు (55) కుమారుల వైఖరికి మనస్తాపం చెంది.. ఠాణా బయట చెట్టు చాటుకు వెళ్లి తన వెంట సీసాలో తెచ్చుకున్న పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. పోలీసులు అప్రమత్తమై మంటలను ఆర్పారు. అప్పటికే ఆమె శరీరం సగానికి పైగా కాలింది. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. జూనియర్ సివిల్ న్యాయమూర్తి నాగరాజు ఆండాళుతో మాట్లాడి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి.. అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. భువనగిరి డీసీపీ నారాయణ రెడ్డి కేసు పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు.
ఇదీ చదవండి: