Mother Suicide in Hyderabad : ఒకే రోజు తల్లి, కుమారుడు బలవన్మరణానికి పాల్పడిన హృదయవిదారక ఘటన హైదరాబాద్‌లో సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వ్యాపారంలో నష్టం రావడంతో మొదట సందీప్ ఉరివేసుకున్నాడని, దాన్ని తట్టుకోలేక తల్లి బలవన్మరణానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన జరిగి సుమారు మూడు రోజులై ఉంటుందని భావిస్తున్నారు.
అందుకు సంబంధించిన వివరాలు పోలీసులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు నగరానికి చెందిన పి.వరప్రసాద్ భార్య సరళ, కుమారుడు సందీప్ కేపీహెచ్‌బీ ఠాణా పరిధిలోని బృందావన్ కాలనీ రిషి కల్యాణ్ రెసిడెన్సీలో నివాసముంటున్నారు. తల్లి సరళ గృహిణి కాగా కుమారుడు సందీప్ వ్యాపారం నిర్వహిస్తున్నారు.
సోమవారం ఉదయం వివాహ ఆహ్వాన పత్రిక ఇచ్చేందుకు వచ్చిన కుటుంబ స్నేహితులు ఇంట్లో నుంచి దుర్వాసన వస్తున్నట్లు గమనించారు. కర్నూలులో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారమందించారు. మాదాపూర్‌లో ఉంటున్న సరళ సోదరుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెట్రోలింగ్ పోలీసులు తలుపు బద్దలుకొట్టి లోపలికి వెళ్లగా సరళ(59) వంటగదిలో, సందీప్(35) పడకగదిలో ఉరేసుకుని కనిపించారు. మృతదేహాలు ఆసుపత్రికి తరలించలేని విధంగా మారాయి. వాటిని తరలించేందుకు పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది ఇబ్బందిపడ్డారు. వాచ్‌మేన్‌కు గురువారం సాయంత్రం సందీప్ అపార్ట్‌మెంట్ నిర్వహణ ఖర్చులు ఇచ్చారు. అప్పటినుంచి తల్లి, కుమారుడు ఇంటి నుంచి బయటకు రాలేదు. వరప్రసాద్ కర్నూలులో రైస్‌మిల్లు నడుపుతున్నారు.