రాజన్న సిరిసిల్ల జిల్లా చిన్నబోనాలకు చెందిన గోస్కుల దేవయ్య అనే వ్యక్తి నిన్న రాత్రి ద్విచక్ర వాహనం పైనుంచి ప్రమాదవశాత్తు పడిపోయాడు. ఘటనలో తలకు తీవ్ర గాయాలయ్యాయి. గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విధుల్లో ఉన్న శ్రవణ్ అనే వైద్యుడు దేవయ్యకు ఇంజక్షన్‌తో పాటు మందులు ఇచ్చి ఇంటికి పంపాడు. ఇంటికెళ్లిన బాధితుడు.. తలలో రక్తం గడ్డకట్టి ఈరోజు మృతి చెందాడు.
కఠిన చర్యలు తీసుకోవాలి..
వైద్యుడి నిర్లక్ష్యంతోనే దేవయ్య మృతి చెందాడని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, స్థానికులు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. వైద్యునిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ అంజయ్య ఘటనా స్థలికి చేరుకున్నారు. బాధితులతో మాట్లాడారు. విచారణ జరిపించి.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఫలితంగా ఆందోళన విరవించారు.
ఇదీ చూడండి: నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన వివాహిత