Suspicious Death in New GaddiAnnaram: పెళ్లై సంవత్సరాలు గడిచినా పిల్లలు కలగకపోవడంతో 27 ఏళ్ల క్రితం ఓ బాబును దత్తత తీసుకున్నారు. సాయితేజ అని పేరు పెట్టుకున్నారు. కుమారుడే సర్వస్వంగా.. దత్త పుత్రుడైనా అల్లారుముద్దుగా పెంచుకుంటూ జీవనం గడుపుతున్నారు. బాగా చదివించారు. ఇక ఆ అబ్బాయికి పెళ్లి వయసు వచ్చింది. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేద్దామని.. రూ.10 లక్షల నగదు.. కాబోయే కోడలి కోసం 35 తులాల బంగారం కొని ఇంట్లో రెడీగా పెట్టుకున్నారు. కానీ ఇంతలోనే అనుకోని విషాదం ఆ ఇంట్లో తలెత్తింది.
వేసవికాలమని ఆరుబయట పడుకున్న ఇంటి యజమాని.. తెల్లారి ఇంట్లోకి వెళ్లి చూసేసరికి.. విగతజీవిగా భార్య పడి ఉంది. బీరువా తెరిచి ఉంది. అందులో ఉన్న డబ్బు, బంగారం మాయమైంది. గారాబంగా పెంచుకున్న కుమారుడు కనపడటం లేదు. కొడుకు ఎక్కడ ఉన్నాడో కనుక్కుందామని ఫోన్ చేస్తే.. స్విచ్ఛాఫ్ వస్తోంది. దీంతో ఏం జరిగిందో అర్థం కాక ఆ యజమాని.. రోదన అక్కడున్న వారిని కలచివేసింది. ఈ విషాదం హైదరాబాద్ న్యూ గడ్డి అన్నారంలో చోటుచేసుకుంది.
హైదరాబాద్ న్యూ గడ్డి అన్నారంలో నివసించే జంగయ్య, భూదేవి అనే దంపతులకు సంతానం లేకపోవడంతో 27ఏళ్ల క్రితం సాయితేజను పుట్టిన కొద్ది రోజులకే ఓ ఆస్పత్రి నుంచి దత్తత తీసుకున్నారు. అప్పటి నుంచి సాయితేజను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. రాత్రి తండ్రి జంగయ్య ఇంటి కింది ఫ్లోర్‌లో పడుకోగా తల్లి, సాయితేజలు మొదటి అంతస్తులో నిద్రించారు. ఉదయం జంగయ్య మొదటి అంతస్తుకు వచ్చి చూడగా భూదేవి అపస్మారక స్థితిలో ఉంది. ఆమెను పరిశీలించగా చనిపోయి ఉండటంతో.. వెంటనే జంగయ్య సరూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అక్కడి పరిస్థితులను పరిశీలించారు. భూదేవి ముక్కు, నోరు మూసి ఊపిరాడకుండా చేయడంతో మృతి చెందిందని పోలీసులు తెలిపారు. వివరాలు సేకరించిన పోలీసులు.. ఇంట్లో 30 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు మాయమైందని తెలిసి.. సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆధారాలు గుర్తుపట్టకుండా ఉండేందుకు ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల తీగలను తెంపివేసి సాయితేజ పారిపోయినట్లుగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. అతని కోసం గాలిస్తున్నారు. సాయితేజ ఆచూకీ దొరికితేనే గాని హత్య ఎవరు చేశారనేది చెప్పలేమని.. పోలీసులు వెల్లడించారు.
ఇవీ చదవండి: రాష్ట్ర సంపదనంతా ఒక కుటుంబం దోచుకుంటోంది: రాహుల్‌గాంధీ