Youths Trapped in Kuwait: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి, జక్రాన్ పల్లి, ఆర్మూర్, సిరికొండ, వేల్పూర్ మండలాలకు చెందిన 8 మంది యువకులు బతుకుదెరువు కోసం కువైట్ దేశానికి ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో వెళ్లారు. మేకల సంజీవ్, కువైట్లో ఒద్దినేని మహేశ్ జగిత్యాల జిల్లాకు చెందిన ఏజెంట్లు మాయమాటలు చెప్పి కువైట్కు తీసుకొని వెళ్లి హోటల్లో వెయిటర్ పని అని చెప్పి, ఎడారిలో షెడ్ల నిర్మాణ కూలీలుగా పెట్టి విపరీతమైన ఎండ దగ్గర పనిలో చేర్పించారు.
ఒంటెలు, పావురాలు, గొర్రెలకు మేత వేయడం లాంటి కష్టమైన పనులు అప్పగించి రోజుకు 15 గంటలు పనిచేయించడంతో యువకులు బెంబేలెత్తారు. వారిని ఇంటికి పంపించమని అక్కడి యజమానితో మొరపెట్టుకున్నారు. యజమాని ఎట్టి పరిస్థితుల్లో పంపేది లేదు అని తెగేసి చెప్పాడు, పంపించిన ఏజెంట్లు తప్పించుకున్నారు. దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ వేదిక అధ్యక్షుడు కోటపాటి నరసింహనాయుడుకు తమ పరిస్థితిని వీడియోలు తీసి పంపించి, తమను ఏ విధంగానైనా ఇండియాకు రప్పించాల్సిందిగా వేడుకున్నారు.
కోటపాటి వెంటనే స్పందించి కువైట్లో గల్ఫ్ కార్మికుల పక్షాన స్వచ్ఛంద సేవ చేస్తున్న గంగుల మురళీధర్ రెడ్డి, ఎన్ఆర్ఐ సెల్ అధికారి చిట్టిబాబును సంప్రదించారు. తమ జిల్లా వాసులను ఏ విధంగానైనా ఇండియాకు పంపడానికి సహాయం చేయవలసిందిగా కోరారు. మురళీధర్ రెడ్డి అక్కడి ఎంబసీ అధికారులను యజమానిని ఒప్పించారు. ఈరోజు 1:30కి 8 మంది క్షేమంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు.
కోటపాటి, మురళీధర్ రెడ్డిలు స్వయంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వెళ్లి బాధితులను రిసీవ్ చేసుకున్నారు. శంషాబాద్ చేరుకున్న బాధితులు.. కోటపాటి, మురళీధర్ రెడ్డి, దాసరి సందీప్లకు ధన్యవాదాలు తెలిపారు. అమాయకులను పక్కా వర్క్ పర్మిట్ ఉంటేనే విదేశాలకు పంపాల్సిందిగా ఏజెంట్లను కోటపాటి హెచ్చరించాడు. 8 మంది బాధితుల దగ్గర మొత్తం 9 లక్షల పైగా ఏజెంట్లు వసూలు చేశారు. వారు చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వాలని లేదంటే తీవ్ర పరిమాణాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఏజెంట్లను హెచ్చరించారు. తన విన్నపాన్ని మన్నించి బాధితులకు రక్షణ కల్పించి ఇండియాకు చేర్చిన గంగుల మురళీధర్ రెడ్డి, చిట్టిబాబు, కోటపాటి నరసింహనాయుడుకు బాధితులు ధన్యవాదాలు తెలిపారు.
ఇవీ చదవండి: