సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ శివారులో ఈనెల 16వ తేదీ బుధవారం సాయంత్రం తల్లీ కూతుళ్లను దారుణంగా హత్యచేసిన నిందితుడికి సహకరించిన ఇద్దరు నిందితులను హుస్నాబాద్ ఏఎస్పీ మహేందర్ మీడియా ముందు ప్రవేశపెట్టారు. తన భార్య కూతుళ్లను చిన్న నాన్న కుమారుడైన గుగ్గిలపు శ్రీనివాస్ గొడ్డలితో నరికి చంపాడని నిర్మల భర్త ప్రవీణ్ ఫిర్యాదు చేసినట్లు ఏఎస్పీ మహేందర్ వెల్లడించారు. ప్రవీణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశామని... దర్యాప్తులో గుగ్గిలపు శ్రీనివాస్యే తన పిన్నిని, సోదరిని చంపినట్లు ఒప్పుకున్నాడని పేర్కొన్నారు.
శ్రీనివాస్‌కు సహకరించిన తల్లి గుగ్గిలపు రాజవ్వ, అన్న గుగ్గిలపు మహేందర్‌ను ఏ2, ఏ3 నిందితులుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నామని ఏఎస్పీ మహేందర్ వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి రెండు ద్విచక్రవాహనాలు, ఓ గొడ్డలి, 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అన్నాతమ్ముళ్లు వంశపారంపర్యంగా వచ్చిన ఆరెకరాల భూమిని చెరి మూడెకరాలు పంచుకోగా... ఉన్న ఒక్క నీళ్ల బావి విషయంలో రెండు కుటుంబాల మధ్య తరచూ గొడవలు జరిగేవని చెప్పారు.
16వ తేదీన గుగ్గిలపు స్వరూప, నిర్మల తమ వ్యవసాయ బావి వద్ద పొలానికి కాలువ ద్వారా నీళ్లు పెట్టుకుంటుండగా... శ్రీనివాస్ కాలువను పూడ్చి వేశాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. మాటామాటా పెరగటడంతో శ్రీనివాస్ పిన్ని స్వరూపను, చెల్లి నిర్మలను గొడ్డలితో నరికి చంపాడు. ఆధారాలు దొరకకుండా ఉండాలని వాటిని దాచిపెట్టినట్లు దర్యాప్తు వెల్లడైందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆధారాలు స్వాధీనం చేసుకున్నామని, నేడు నిందితులు ముగ్గురిని కోర్టులో హాజరు పరుస్తామని ఏఎస్పీ మహేందర్ వెల్లడించారు.
ఇదీ చూడండి: పోలీసులకు ఓ శునకం విన్నపం.. ఏంటంటే?