Husband commits suicide at first wife's grave : ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అకాల మరణంతో మనోవేదనకు గురైన యువకుడు రెండో వివాహమైనా తనను మరిచిపోలేక ఆమె సమాధి వద్దే పురుగుల మందు తాగిన ఘటన రాజంపేట మండలం కొండాపూర్‌లో చోటుచేసుకుంది. ఎస్సై రాజు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. పుట్ట సురేశ్(28) నాలుగేళ్ల క్రితం తన గ్రామానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి పాప పుట్టిన రెండేళ్లకే భార్య చనిపోవడంతో సురేశ్ మానసికంగా కుంగిపోయాడు.
మరో రెండేళ్ల తరువాత కుటుంబసభ్యులు ఒప్పించి మరో యువతితో వివాహం జరిపించారు. వీరికి కూడా ఒక పాప పుట్టింది. అయినా తన మొదటి భార్యను మరిచిపోలేక తరచూ ఆమె సమాధి వద్దకు వెళ్లి బాధపడుతుండేవాడు. ఈ నెల 2న సమాధి వద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కామారెడ్డి ప్రభుత్వాసుపత్రి తీసుకెళ్లగా.. వైద్యులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని గాంధీకి సిఫార్సు చేశారు. అక్కడే చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందాడు. ఈ మేరకు మృతుడి తండ్రి బాలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.