Couple Were Beaten in Medak : మంత్రాలు చేస్తున్నారన్న అనుమానంతో దంపతులను సమీప బంధువులే విద్యుత్తు స్తంభానికి కట్టేసి కొట్టిన ఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గంలో చోటుచేసుకుంది. దాడికి తెగబడ్డ వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
![మంత్రాలు చేస్తున్నారని దంపతులపై దాడి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-srd-31-14-mantralu-baryabarthalapy-daadi-av1-g5-ts10131_14022022213438_1402f_1644854678_981.jpg)
ఎస్.ఐ. మోహన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
Couple Were Beaten at Alladurgam : అల్లాదుర్గం గ్రామానికి చెందిన కిష్టయ్య, భూమయ్యలు అన్నదమ్ములు. భూమయ్య గతంలో అనారోగ్యంతో మృతి చెందాడు. భూమయ్య చిన్న కుమారుడు రమేశ్ సంగారెడ్డి జిల్లా వట్‌పల్లిలోని ఓ హోటల్‌లో, ఆయన భార్య రజిత కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొంత కాలం క్రితం కిష్టయ్య అనారోగ్యానికి గురయ్యారు. రమేశ్ మంత్రాలతోనే తమతండ్రి అనారోగ్యానికి గురయ్యాడని కిష్టయ్య కుమారులు కుమార్, నాగేష్, బేతయ్య, కుమార్తె అంబమ్మ అనుమానం పెంచుకున్నారు. ఆదివారం రాత్రి ఇంటికి వెళ్తున్న రమేష్‌పై కిష్టయ్య భార్య ఆశమ్మ, వారి కుమారులు, కుమార్తె దాడి చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన రజితనూ కొట్టారు. తిరిగి సోమవారం రమేశ్, రజితను వారు బయటకు లాక్కొచ్చి, విద్యుత్తు స్తంభానికి కట్టేసి కొట్టారు. దంపతులపై దాడికి పాల్పడిన అయిదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్.ఐ. తెలిపారు.
ఇదీ చదవండి : Murder case news: మంత్రాల నెపంతో మతిస్థిమితం లేని వ్యక్తిని చంపేశారు!