Forest Officer Attack: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలం సాకివాగు అటవీ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కట్టెల కోసం అడవికి వెళ్లిన తమపై స్థానిక అటవీ శాఖ అధికారి అసభ్యంగా ప్రవర్తించాడని ఆదివాసి మహిళలు ఆరోపించారు. ఓ మహిళ వస్త్రాలు లాగి వివస్త్రను చేసి దాడి చేశారని వాపోయారు. గురువారం(జనవరి 20న) జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా.. చర్చనీయాంశంగా మారింది.
తరుమే క్రమంలో బట్టలు లాగి..
సాకివాగు గుత్తికోయ గూడెంకు చెందిన నలుగురు మహిళలు గురువారం మధ్యాహ్నం కట్టెల కోసం అటవీ ప్రాంతానికి వెళ్లారు. వంటచెరుకుగా వినియోగించే కట్టెల కోసం వెళ్లిన మహిళలను.. అటవీ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తోన్న ఫారెస్ట్ బీట్ అధికారి మహేశ్ అడ్డుకున్నాడు. అడవిలోకి ఎందుకు వచ్చారంటూ మహిళలను తరిమాడు. ఆ సమయంలో తమపై అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు దుర్భాషలాడారని బాధితులు ఆరోపించారు. తమలో ఒకరిపై చేయి చేసుకున్నారని వాపోయారు. మరో ముగ్గురు పారిపాయే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అటవీ అధికారి అందులోని ఓ మహిళ వస్త్రాలు లాగగా.. ఆమె బట్టలు ఊడిపోయాయి. అధికారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న ఆమె అక్కడి నుంచి పారిపోయి వచ్చినట్టు చెప్పుకొచ్చింది. ఇదే సమయంలో మరో మహిళ గోతిలో పడిపోగా.. గాయాలయ్యాయి. మిగిలిన మహిళలు ఆమెను తీసుకుని గుత్తికోయ గ్రామానికి తీసుకొచ్చారు.
పరాకాష్టకు అధికారుల దౌర్జన్యాలు..
అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనను మహిళలు భయంతో ఎవరికీ చెప్పుకోలేదు. శుక్రవారం(జనవరి 21న) గ్రామానికి వెళ్లిన ముల్కలపల్లి మండలానికి చెందిన నాయకులతో మహిళలు గోడు వెళ్లబోసుకోగా.. విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో.. అటవీ అధికారి తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఆదివాసీ మహిళలపై జరిగిన దాడిని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు తీవ్రస్థాయిలో ఖండించారు. ఆదివాసీ మహిళలపై అమానుషంగా ప్రవర్తించడం దారుణమన్నారు. ఆదివాసీ, గిరిజనులపై అటవీ అధికారుల దౌర్జన్యాలు పరాకాష్టకు చేరుతున్నాయని మండిపడ్డారు. ఆదివాసీ మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదే ఘటనపై ముల్కలపల్లి అటవీశాఖ అధికారి రవికిరణ్‌ను సంప్రదించగా.. సాకివాగు అటవీ ప్రాంతంలో అలాంటిదేం జరగలేదని తోసిపుచ్చారు. అటవీ ప్రాంతానికి వచ్చిన కొంతమందిని కట్టెలు కొట్టవద్దని మహేశ్ హెచ్చరించిన మాట వాస్తవమేన్నారు. మహిళలపై ఎలాంటి అనుచిత ప్రవర్తన జరగలేదని.. వారి ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: