ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం సీతాపాలెం బీచ్‌లో స్నానానికి దిగిన ఏడుగురు విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు. వీరిలో నర్సీపట్నానికి చెందిన పవన్(19) మృతి చెందగా.. కొనఊపిరితో ఉన్న సూరిశెట్టి తేజ అనే విద్యార్థిని స్థానిక మత్స్యకారులు రక్షించారు. గోపాలపట్నానికి చెందిన జగదీశ్, నర్సీపట్నానికి చెందిన జశ్వంత్, గుంటూరుకు చెందిన సతీశ్, చూచుకొండకు చెందిన గణేశ్, యలమంచిలికి చెందిన చందూ గల్లంతయ్యారు. గల్లంతైన ఐదుగురి కోసం తీరం వద్ద పోలీసులు, మెరైన్ పోలీసులు, మత్స్యకారులు గాలిస్తున్నారు.
అనకాపల్లి డైట్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన 12మంది విద్యార్థులు శుక్రవారం మధ్యాహ్నం కళాశాలలో పరీక్షలు రాసి సీతాపాలెం బీచ్‌కు వచ్చారు. వీరిలో ఏడుగురు స్నానానికి దిగగా.. మిగిలిన వారు తీరం ఒడ్డునే నిల్చున్నారు. ఒక్కసారిగా రాకాసి అల రావడంతో వీరంతా సముద్రంలో మునిగిపోయినట్టు సమాచారం. ఒడ్డున ఉన్న తోటి విద్యార్థులు కేకలు వేయడంతో సమీపంలో ఉన్న మత్స్యకారులు సూరిశెట్టి తేజను కొన ఊపిరితో కాపాడారు. చికిత్సకోసం అతన్ని అనకాపల్లి ఆసుపత్రికి అనంతరం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. సీతాపాలెం ప్రమాద ఘటనపై మంత్రి గుడివాడ అమర్‌నాథ్ స్పందించారు. గల్లంతైన ఐదుగురు విద్యార్థుల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని వెల్లడించారు. సహాయక చర్యలను జిల్లా కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
ఇదీ చూడండి: అయ్యో పాపం.. నీటిలో కొట్టుకుపోయిన వాషింగ్ మిషన్... వర్షంతో భారీగా ట్రాఫిక్‌జామ్