రాష్ట్ర రాజధానిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పాతబస్తీ బహదూర్‌పురలోని నాలుగు గోదాంలలో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ప్రమాద సమయంలో గోదాముల్లో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణనష్టం తప్పింది. ఒకదాని పక్కన ఒకటి ఉన్న వాహన విడిభాగాలు, బొగ్గు, మరో 2 గోదాముల్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 8 అగ్నిమాపక శకటాలతో తీవ్రంగా శ్రమించి దాదాపు 6 గంటల్లో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. భారీ అగ్నిప్రమాదం కావడంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి.
రూ.50 లక్షల ఆస్తినష్టం
నగర పోలీసు సంయుక్త కమిషనర్ తరుణ్‌జోషి, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. ప్రమాదంలో దాదాపు రూ.50 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని గోదాము యజమానులు వాపోయారు. మంటలను అదుపు చేయడానికి గోదాముల గోడలను ప్రొక్లెయినర్ల సాయంతో కూల్చివేశారు.
అగ్నికీలల్లో గోదాంలు
గోదాంల వెనుక భాగం నుంచి మంటలు వ్యాపించడం వల్ల పూర్తిగా ముందుకు వ్యాపించే వరకు ఎవరూ గమనించలేదు. స్థానికులు గమనించే సరికి గోదాంలు పూర్తిగా అగ్నికీలల్లో చిక్కుకున్నాయి.
మంటలు అదుపులోకి రావడం వల్ల స్థానికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్టు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.
- ఇదీ చదవండి : ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించటంలో అదే వైఫల్యం