జనగామ జిల్లా పాలకుర్తి మండలం దర్దెపెల్లి గ్రామంలో దారుణం జరిగింది. తాగిన మైకంలో తండ్రీకొడుకులు గొడవ పడ్డారు. ఈ ఘటనలో కోపోద్రిక్తుడైన తండ్రి కన్నకొడుకునే హతమార్చాడు. గ్రామానికి చెందిన మెరుగు సమ్మయ్య, కళమ్మలు భార్యాభర్తలు. కళమ్మ దివ్యాంగురాలు. వీరిద్దరికీ ఒక్కాగానొక్క సంతానం. అతని పేరు రాజు. రాజుకు ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. కానీ పెళ్లైన మూడు నెలలకే భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య తనని వదిలి వెళ్లిపోవడంతో... మానసికంగా కుంగిపోయిన రాజు తాగుడుకు బానిసయ్యాడు.
ఇద్దరూ మత్తులోనే...
ప్రతిరోజూ తాగి వచ్చి తల్లిదండ్రులతో గొడవ పడేవాడు. నిన్న మద్యం సేవించిన రాజు... ఇంటికి వచ్చి తండ్రి సమ్మయ్య, దివ్యాంగురాలైన తల్లి కళమ్మలతో గొడవకు దిగాడు. సమ్మయ్య కూడా నిన్న మద్యం సేవించాడు. ఇద్దరూ మద్యం మత్తులో ఉండడంతో గొడవ కాస్త పెద్దదిగా మారింది. తల్లి ఎంత చెప్తున్నా వినకుండా తండ్రీకొడుకులు... కొట్టుకునే స్థితికి వచ్చారు.
కుప్పకూలిన కొడుకు...
కోపోద్రిక్తుడైన సమ్మయ్య కట్టె తీసుకొని... రాజు తలపై బలంగా కొట్టాడు. తలకి బలమైన గాయమవడంతో... రాజు ఒక్కసారిాగా కుప్పకూలాడు. తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే చనిపోయాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై వంశీకృష్ణ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: స్నేహితుల రోజునే విషాదం... గోదావరిలో ముగ్గురి మృదేహాలు లభ్యం