- ఏపీలోని తీర ప్రాంతానికి చెందిన ఓ మాజీ సర్పంచి పెద్ద కుమారుడు ఉద్యోగ రీత్యా కెనడాలో స్థిరపడ్డారు. చిన్న కుమారుడు ఉన్నత చదువులకు అమెరికా వెళ్లి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. పెద్ద కుమారుడి దంపతులకు కుమారుడు పుట్టడంతో మనవడిని చూడటానికి మాజీ సర్పంచి అయిన ఆమె కెనడా వెళ్లారు. ఆరు నెలలు అక్కడే ఉండి ఇరవై రోజుల కిత్రం కోడలు, మనవడు, మనవరాలితో కలిసి సొంతూరు వచ్చారు. ఇంటికి వచ్చిన కొద్ది రోజులకే ఆమెకు కరోనా వైరస్ సోకింది. వారం కిత్రమే టీకా మొదటి డోసు వేయించుకున్నారు. టీకా వేయించుకున్న తర్వాత కొవిడ్ అనుమానిత లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రిలో చేరారు. వారం రోజులకే పరిస్థితి విషమించి మృతి చెందారు. స్థానికంగా ఉంటున్న చిన్న కుమారుడి స్నేహితుడు ఆసుప్రతిలో చేర్పించడం నుంచి దగ్గరుండి అన్ని చూసుకున్నారు. ఈ క్రమంలో అతడు కూడా కొవిడ్ బారినపడ్డాడు. తల్లికి అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి కుమారులెవరూ విదేశాల నుంచి రాలేకపోయారు. స్నేహితుడి ఫోన్ నుంచి వీడియో కాల్ ద్వారా అమ్మ పార్థివదేహాన్ని అమెరికా, కెనడాలోని కుమారులు చూసి విలపించారు. ఓ ట్రస్టు ద్వారా మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.
- డెల్టాలో ఓ గ్రామానికి చెందిన యువకుడు ఉన్నత చదువులు చదవడానికి ఆస్ట్రేలియా వెళ్లి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. పదేళ్ల క్రితమే తండ్రి చనిపోయాడు. ఇంట్లో ..తల్లి, అమ్మమ్మ మాత్రమే ఉంటున్నారు. తల్లి కరోనా బారినపడింది. ఆస్ట్రేలియా నుంచి రావడానికి ప్రయాణ ఆంక్షలు ఉండటంతో సొంతూరు వచ్చి అమ్మ యోగక్షేమాలు చూసుకుందామన్నా రాలేని దుస్థితి. స్నేహితుడి సహకారంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించినా దేవుడు కరుణించలేదు. చికిత్స పొందుతూ తొమ్మిది రోజులకే మృతి చెందారు. స్నేహితుడి ఫోన్ నుంచి చేసిన వీడియో కాల్ ద్వారా అమ్మను కడసారిగా చూసి వెక్కివెక్కి ఏడ్చాడు. ఓ ట్రస్టు ద్వారా అంత్యక్రియలు నిర్వహించారు.
ఏపీలోని గుంటూరు జిల్లా వాసులు ఎంతోమంది విదేశాల్లో ఉంటున్నారు. ప్రస్తుతం కరోనా కేసుల వ్యాప్తి నేపథ్యంలో ప్రవాసాంధ్రులు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. అయితే వైరస్ ఉద్ధృతి తీవ్రంగా ఉండటంతో కరోనా సోకిన తల్లిదండ్రులను బంధువులు, స్నేహితుల సహకారంతో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. గంట గంటకు ఫోన్ చేసి ఆరోగ్యంపై అడిగి తెలుసుకుంటున్నారు. వైరస్‌తో విలవిలలాడిపోతున్న సమయంలో అందుబాటులో లేకపోవడం అటు విదేశాల్లో ఉంటున్న పిల్లలను, ఇటు తల్లిదండ్రులను తీవ్రంగా బాధిస్తోంది. ఒక వేళ పరిస్థితి విషమించి మరణిస్తే అంత్యక్రియలు నిర్వహణకు విదేశాల నుంచి రాలేని పరిస్థితి. అల్లారుముద్దుగా పెంచినవారు దూరమైతే కనీసం దగ్గర లేకపోయామని తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం అమెరికా, ఆస్ట్రేలియా.. తదితర దేశాల నుంచి విమాన రాకపోకలపై ఆంక్షలు ఉండటంతో అక్కడ నుంచి రాలేకపోతున్నారు. ఫోన్‌లోనే కడసారి చూపును చూసి కుమిలిపోతున్నారు.
అమ్మానాన్న ఎలా ఉన్నారో..
విదేశాల్లో ఉంటున్న పిల్లలు తమ కన్నవారి యోగక్షేమాలపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై ఏరోజుకారోజు ఫోన్ చేసి జాగ్రత్తలు సూచిస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లవద్దని, ఇంటికి ఎవరిని రానివ్వద్దని చెబుతున్నారు. పరిస్థితులు ఏ మాత్రం బాగోలేదని హెచ్చరికలు చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా ఉద్ధృతి తీవ్రంగానున్న నేపథ్యంలో వృద్ధులైన తల్లిదండ్రుల ఆరోగ్యం ఎలా ఉంటుందోనని కొంతకాలంగా ఒత్తిడికి లోనవుతున్నారు.
తీర ప్రాంతానికి చెందిన యువకుడు ఉన్నత చదువులు చదివి అమెరికాలో స్థిరపడ్డాడు. విదేశాల్లో ఉంటున్నా గాని, తల్లిదండ్రులకు ఏ ఇబ్బంది రాకుండా బాగా చూసుకున్నాడు. కరోనా వైరస్ మొదటి ఉద్ధృతి సమయంలో కన్నవారు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. స్నేహితులు, బంధువుల ద్వారా వారికి కావాల్సిన అన్నీ సమకూర్చి పెట్టాడు. కొవిడ్ వైరస్ రెండో ఉద్ధృతి తీవ్రంగా ఉందని తెలియడంతో భయపడ్డాడు. రోజూ ఐదు సార్లు ఫోన్ చేసి యోగక్షేమాలు ఎప్పటికప్పుడు తెలుసుకునేవాడు.
ఇంట్లో ఉంటున్నా గాని అమ్మానాన్నలకు కరోనా వైరస్ సోకింది. అనుమానిత లక్షణాలు కనిపించిన వెంటనే స్నేహితుడి సహకారంతో ఇద్దరినీ ఆసుపత్రిలో చేర్పించారు. రెమ్‌డెసివర్ ఇంజక్షన్లు లభించక ఇబ్బంది పడ్డా రూ.లక్షలు చెల్లించి కొనుగోలు చేసి చేయించాడు. తల్లిదండ్రులు ఆసుపత్రిలో ఉన్న పది రోజులు తీవ్రంగా కలత చెందాడు. సరిగా నిద్రపోలేదు. ఉద్యోగానికి సెలవు పెట్టి వైద్యులు, స్నేహితులకు ఫోన్ చేసి కన్నవారి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీశాడు. వైద్యుల కృషి ఫలించి అమ్మానాన్నలు వైరస్‌ను జయించి తిరిగి ఇంటికి రావడంతో ఊపిరి పీల్చుకున్నాడు.
- ఇదీ చదవండి : అంబులెన్స్‌లో గర్భిణి మృతిపై హైకోర్టు ఆందోళన