30 వేల కట్నం ముగ్గురి ప్రాణాలను బలితీసుకుంది. అదనపు కట్నం ఇవ్వాలంటూ అత్తింటి వారు పెట్టే చిత్రహింసలు తట్టుకోలేక ఓ తల్లి...... ఇద్దరు పిల్లలతో సహా బావిలోకి దూకి బలవన్మరణానికి పాల్పడింది. జూలపల్లి మండలం అబ్బాపూర్‌కు చెందిన టెక్కం రాజయ్య కుమార్తె విజయను... నిమ్మనపల్లికి చెందిన స్వామికి ఇచ్చి 2016లో పెళ్లి చేశారు. కట్నం కింద లక్షన్నర ఇవ్వాల్సి ఉండగా... వివాహ సమయంలో 70 వేలు, 50 వేల విలువైన బంగారం ఇచ్చారు. మిగిలిన 30 వేల కట్నంతోపాటు అదనంగా మరో లక్ష తేవాలని విజయను నిత్యం అత్తింటివారు వేధించేవారు. భర్త స్వామి, ఆడపడుచు పద్మ, అత్త లక్ష్మి....... శారీరకంగా, మానసికంగా హింసించేవారని విజయ కుటుంబ సభ్యులు తెలిపారు.
గతంలో అబ్బాపూర్‌లో పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ జరగ్గా 30 వేల కట్నం బాకీ ఇస్తామని విజయ తల్లిదండ్రులు చెప్పారు. తర్వాత ఆమె తల్లి చనిపోవడం, పంటలు పండకపోవడంతో కట్నం బాకీ ఇవ్వలేకపోయారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఆడబిడ్డ పద్మ, అత్త లక్ష్మిలు కట్నం తేవాలంటూ విజయను తీవ్రంగా కొట్టారు. ఆ విషయాన్ని కూలీకి వెళ్లిన భర్తకు విజయ ఫోన్ చేసి చెప్పగా.. సాయంత్రం వచ్చి మాట్లాడతానని చెప్పాడు. తర్వాత విజయ తన ఇద్దరు పిల్లలను తీసుకొని వెళ్లి తిరిగి రాలేదు. నిన్న నిమ్మనపల్లి శివారులోని వ్యవసాయ బావిలో ఇద్దరు చిన్నారుల మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బావి అడుగున ఉన్న విజయ మృతదేహాన్ని ఈతగాళ్ల సాయంతో వెలికితీశారు.మృతురాలి తండ్రి రాజయ్య ఫిర్యాదు మేరకు... విజయ భర్త, అత్త, ఆడబిడ్డ, బావ, తోటికోడలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి: జిల్లాలపై కరోనా పంజా... వారంలోనే ఐదు రెట్ల కేసులు నమోదు