అశ్వారావుపేట మండలం ఊట్లపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి (38).. ఐదు రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో గురువారం ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. పాజిటివ్‌గా తేలడంతో.. వైద్యులు అతనికి మందులు ఇచ్చి పంపించారు.
భావోద్వేగానికి గురై..
ఇంటికి చేరుకున్న బాధితుడు.. తల్లిదండ్రులు, భార్యాపిల్లలను చూసి ఒక్కసారిగా భావోద్వేగానికి గురి కావడంతో రక్తపోటు పెరిగింది. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. దీంతో కుటుంబం 108కి సమాచారం అందించారు. అంబులెన్స్ వచ్చే లోపే అతడు ప్రాణాలు వదిలాడు.
కళ్లముందే చావుతో..
బాధితుడి మరణాన్ని.. కళ్లారా చూసిన కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. మృతదేహానికి రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది దహన సంస్కారాలు నిర్వహించారు. భయం కారణంగానే రక్తపోటు పెరిగి శ్వాస ఇబ్బందిగా మారిందని వైద్యులు నిర్ధరించారు. వైరస్ సోకిన వారు ఎలాంటి భయాందోళనలు పెట్టుకోకుండా.. మహమ్మారిని ధైర్యంగా ఎదుర్కోవాలని వారు సూచించారు.
ఇదీ చదవండి: జీహెచ్‌ఎంసీ పరిధిలో 63 మినీ కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు