Bellamkonda Suresh Controversy : తన ఇద్దరు కుమారులంటే తనకు పంచ ప్రాణాలని సినీ నిర్మాత బెల్లంకొండ సురేశ్ అన్నారు. వారి జోలికి వస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. తన పెద్ద కొడుకు బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌పై తప్పుడు ఆరోపణలు చేసిన శరణ్ అనే వ్యాపారిపై క్రిమినల్ కేసు పెడతానని అన్నారు. తమ కుటుంబంపై ఆరోపణలు చేసిన అతడిపై పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు.
అసలేం జరిగిందంటే..
Cheating Case on Bellamkonda Suresh : హైదరాబాద్‌కు చెందిన శరణ్ అనే వ్యాపారి.. 2018లో బెల్లంకొండ శ్రీనివాస్ చేసే ఓ సినిమా కోసం ఆయన తండ్రి బెల్లంకొండ సురేశ్ తన వద్ద రూ.85 లక్షలు తీసుకుని ఇప్పటివరకు తిరిగి ఇవ్వలేదని ఆరోపించారు. ఈ విషయంలో నాంపల్లి కోర్టును ఆశ్రయించగా.. పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం బెల్లంకొండ సురేశ్, శ్రీనివాస్‌పై కేసు నమోదు చేయాలని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాలమ మేరకు.. పలు సెక్షన్ల కింద ఇరువురిపై కేసు నమోదు చేశారు.
FIR Booked Against Bellamkonda Suresh : "నేను డబ్బులు తీసుకున్నట్లు నిన్న శరణ్ చెప్పాడు. నాకు డబ్బులు ఇచ్చినట్లు ఆధారాలుంటే పోలీసులకు ఇవ్వాలి. పోలీసులు నాకు నోటీసులు ఇవ్వలేదు, అతనికి ఇచ్చారు. నా పిల్లలంటే నాకు పంచ ప్రాణాలు. నా కుమారుడి జోలికి వచ్చిన శరణ్‌పై క్రిమినల్ కేసు పెడ్తా. మాపై ఆరోపణలు చేసిన శరణ్‌పై పరువు నష్టం దావా వేస్తా. 2018లో రూ.85 లక్షలు ఇస్తే ఇప్పుడు గుర్తొస్తుందా? మా అబ్బాయిని అతను కలిసిన సందర్భమే లేదు. సినిమా టికెట్ల కోసం శరణ్ నాకు ఫోన్ చేసేవాడు. తప్పుడు కేసులతో బ్లాక్‌మెయిల్ చేయాలని చూస్తున్నాడు. శరణ్ ఓ రాజకీయ నాయకుడికి బినామీగా ఉన్నాడు. పోలీసుల విచారణకు నేను పూర్తిగా సహకరిస్తాను." - బెల్లంకొండ సురేశ్, సినీ నిర్మాత