Auto Driver Attack on Women: హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో స్థానిక ఈశ్వర్ థియేటర్ వద్ద ఇద్దరు వ్యక్తులు తారస్థాయిలో గొడవపడుతున్నారు. ట్రాలీ ఆటో డ్రైవర్, ద్విచక్ర వాహనదారుడికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు చేయిచేసుకునే వరకు పరిస్థితి వచ్చింది. అదే సమయంలో అటుగా మరో బైక్‌పై చందు అనే దంపతులు వెళ్తున్నారు. ఆ గొడవను చూసి ద్విచక్రవాహనదారుడి పరిస్థితిపై జాలి పడ్డారో ఏమో.. గొడవను ఆపేందుకు వెళ్లారు. వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. గొడవను ఆపేందుకు చిన్నపిల్లాడితో ఉన్న మరో మహిళ కూడా అక్కడికి వచ్చింది.
అంతే ఒక్కసారిగా ఆటో డ్రైవర్ రెచ్చిపోయాడు. మహిళలు అని కూడా చూడకుండా అసభ్య పదజాలంతో దూషించడం మొదలుపెట్టాడు. వారిపై దాడికి దిగాడు. కోపోద్రిక్తురాలైన ఓ మహిళ.. చెప్పుతో అతడిని కొట్టేందుకు యత్నించింది. అంతే ఆ వ్యక్తి ఒక్కసారిగా తన చెప్పు తీసుకుని మళ్లీ వారిపై ఇష్టారీతిన దాడికి పాల్పడ్డాడు. అప్పటిదాకా ఆ సన్నివేశాన్ని చూస్తున్న స్థానికులు.. ఆటో డ్రైవర్ చేష్టలు తీవ్రరూపం దాల్చడంతో జోక్యం చేసుకున్నారు. దీంతో గొడవ సద్దుమణిగింది. మహిళలపై దాడికి పాల్పడిన ఆటో డ్రైవర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇవీ చదవండి: నడిరోడ్డుపై మహిళ వీరంగం.. స్కూటీని ఢీకొట్టాడని యువకుడిపై దాడి