ములుగు జిల్లాలో రెండు వేరువేరు ఘటనల్లో ఓ యువతి,యువకుడు మృతి చెందారు. యువతి అనారోగ్యంతో మరణించగా.. యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
అనారోగ్యంతో..
ములుగు మండలం దేవగిరిపట్నం గ్రామానికి చెందిన నాగావత్ రుక్మిణి అనారోగ్యంతో బాధపడుతోంది. ఐదు రోజులుగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్న రుక్మిణిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. వైద్యం చేయించినప్పటికి ఆరోగ్యం కుదుటపడలేదు. దీంతో హన్మకొండలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ యువతి మరణించింది.
బలవన్మరణం..
ఇదే గ్రామానికి చెందిన కేలోతు మహేందర్ అనే యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మహేందర్ ఐటీఐ పూర్తి చేసి శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో అప్రెంటిషిప్ చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇతను కూడా ఆరోగ్య సమస్యలతోనే బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. ఐతే రుక్మిణి మహేందర్ కొంతకాలంగా ప్రేమించుకున్నారని, ప్రియురాలి అకాల మరణం తట్టుకోలేక మహేందర్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు వదంతుులు వినిపిస్తున్నాయి. ఇరువురి మృతి పట్ల ఎస్సై రామకృష్ణను వివరణ కోరగా తమ విచారణలో రుక్మిణి అనారోగ్యంతో మరణించినట్లు తెలిసిందని, వారి కుటుంబాల నుండి ఎలాంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు.
ఇదీ చదవండి: పాతబస్తీలోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం.. తప్పిన ప్రాణ నష్టం