women suicide: చెల్లి, తమ్ముడి చదువులకు అండగా.. తల్లిదండ్రులకు ఓ కొడుకులా కుటుంబానికి తోడుగా ఉండాలనుకుంది ఆమె.. అందుకే తోటి స్నేహితురాళ్లు పెళ్లిళ్లు చేసుకుని వెళ్లిపోతుంటే తనపైనే ఆధారపడిన కుటుంబం కోసం అవివాహితగానే ఉండిపోయింది. వారికి అన్నీ తానై వ్యవహరించింది. ఉన్నత చదువు పూర్తి కాగానే ఉద్యోగంలో చేరింది. అంత అనుకున్నట్లుగానే సాగిపోతున్న తరుణంలో.. అర్హత పరీక్షలో ఉత్తీర్ణురాలు కాకపోవడం మనోవేదనకు గురి చేసింది. ఇప్పటికే కరోనాతో ఛిద్రమైన కుటుంబ ఆర్థిక పరిస్థితి. చాలీచాలని తాత్కాలిక ఉద్యోగ వేతనం.. తనపైనే ఆధారపడిన వారికి పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోతున్నాననే బాధ. వెరసీ మూడు పదుల వయస్సులోనే చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడటంతో ఆ కుటుంబానికి ఆధారం, అండ లేకుండా పోయింది. హృదయ విదారకమైన ఈ ఘటన కాజీపేటలో శనివారం ఉదయం చోటు చేసుకుంది.
వరంగల్‌లోని కాశీబుగ్గ ఇందిరాగాంధీ విగ్రహ ప్రాంతానికి చెందిన గుండు భాగ్యలక్ష్మి అశోక్ దంపతులకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. వారిలో రమ్య(32) మూడో సంతానం.. ఎమ్మెస్సీ కెమెస్ట్రీ చదువుకున్నారు. రమ్య కంటే పెద్దవారైన ఇద్దరి పెళ్లిళ్లు జరిగాయి. తల్లి గృహిణి కాగా, తండ్రి గతంలో బంగారం దుకాణంలో పనిచేసేవారు. రమ్య జాతీయ సాంకేతిక సంస్థ (నిట్)లో ల్యాబ్ అసిస్టెంట్ తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన డిపార్ట్‌మెంటల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంలో విఫలమయ్యారు. ఇక తనకు శాశ్వత ఉద్యోగం రాదేమోనని మనస్తాపంతో శుక్రవారం ఉదయం ఇంట్లోంచి వెళ్లింది శుక్రవారం యువతి కనిపించలేదని ఇంతేజార్‌గంజ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కాజీపేటలోని వడ్డేపల్లి చెరువులో ఆత్మహత్యకు పాల్పడ్డారు. శనివారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమందించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కాశీబుగ్గవాసులు కోరుతున్నారు. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహేందర్‌రెడ్డి తెలిపారు.
ఇవీ చూడండి: Heroine Harassment: ప్రముఖ సినీ నటికి అసభ్యకర సందేశాలు.. ఫొటోలు మార్ఫింగ్ చేసి..!
నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
బగ్గాకు ఊరట.. పంజాబ్ పోలీసులకు షాక్.. హైకోర్టు కీలక ఆదేశాలు!