WOMEN SUICIDE IN HUZURABAD: ఆన్లైన్లో పరిచయమైన యువతిని ప్రేమించి.. కొద్ది రోజులు సహజీవనం చేశాడు. ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకున్నాడు. మోజు తీరాక ఆ యువతిని వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో నయవంచనకు గురై మోసపోయానని తెలుసుకున్న యువతి భర్త ఇంటిముందు 43 రోజుల పాటు పోరాడి తనువు చాలించింది. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్లిపోయింది. ఈ హృదయ విదారక ఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో జరిగింది.
కడపకు చెందిన అమ్మాయితో పరిచయం
AP women suicide: హుజూరాబాద్‌కు చెందిన సుజిత్ రెడ్డి హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తున్నాడు. సుజిత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్‌లోని కడపకు చెందిన సుహాసినితో ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా పరిచయం ఏర్పడింది. సుహాసిని చెప్పిన వివరాల ప్రకారం.. తనను ప్రేమిస్తున్నానని చెప్పి సుజిత్ రెడ్డి ఆమెకు దగ్గరయ్యాడు. ఆమె కూడా అతని ప్రతిపాదనకు ఓకే చెప్పింది. కొన్నేళ్ల పాటు ఇద్దరు కలిసి సహజీవనం కూడా చేశారు. వివాహం చేసుకోమని కోరగా.. నిరాకరించాడని దీంతో తాను పోలీసులను ఆశ్రయించానని చెప్పింది.
ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్న సుజిత్ రెడ్డి
marriage with sujith reddy: 2020 నవంబర్ 25న హైదరాబాద్‌లోని ఆర్య సమాజ్‌లో సుహాసినిని సుజిత్ రెడ్డి వివాహం చేసుకున్నాడు. నెల రోజుల పాటు కడపలో కాపురం చేశాక..తన ఇంట్లో పెద్దలను ఒప్పించి తీసుకెళ్తానని ఆమెకు నచ్చ చెప్పాడు. అదే క్రమంలో మెల్లగా ఆమెకు దూరమై పట్టించుకోవడం మానేశాడు. కడప నుంచి ఇంటికి తిరిగొచ్చిన సుజిత్ రెడ్డి... హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తున్నాడు. భర్త ఎంతకూ రాకపోయేసరికి ఆయన ఆచూకీ కోసం ఆరా తీసింది. ఈ లోగా కరోనా పరిస్థితుల వల్ల లాక్ డౌన్ రావడంతో అక్కడే ఉండి పోయింది.
సెకండ్ వేవ్‌లో తల్లిదండ్రులను కోల్పోయిన యువతి
dharna at husband house: సెకండ్ వేవ్ సమయంలో సుహాసిని తల్లి దండ్రులిద్దరూ వైరస్ బారిన పడి చనిపోయారు. తన సోదరుడు ఉన్న అతనికి భారం కాలేక భర్త దగ్గరికి పోవాలని నిర్ణయించుకుంది. ఎట్టకేలకు భర్త ఆచూకీ తెలుసుకుని గతేడాది నవంబర్ 26న సుజిత్ ఇంటికి వచ్చి భర్తను కలిసింది. ఆ తర్వాత అత్తింటివాళ్లు ఇంట్లోకి రమ్మని పిలిచి తనను కొట్టారని పోలీసులను ఆశ్రయించింది. ఆ మర్నాటి నుంచి మళ్లీ భర్త ఇంటి దగ్గరే బైఠాయించి చాలా రోజుల పాటు ఆందోళన చేసింది. దీంతో సుజిత్ రెడ్డి, ఆమె తల్లిదండ్రులు అక్కడ నుంచి హనుమకొండ వెళ్లిపోయారు. సుహాసిని అక్కడికి కూడా వెళ్లి ఆందోళన చేపట్టింది. అయినా ఆమెకు ఎవరు అండగా నిలవలేదు. దీంతో భర్త కుటుంబసభ్యులు మళ్లీ హజూరాబాద్ వచ్చేశారు.
భర్త కోసం 43 రోజులుగా పోరాటం
huzurabad: అయినప్పటికీ పట్టు వదలని సుహాసిని తిరిగి హుజూరాబాద్ వచ్చి 40 రోజులుగా ఇంటి ముందే ఉంటూ ఎవరైనా భోజనం పెడితే తింటూ.. ఎముకలు కొరికే చలిలోనే నిద్రిస్తూ భర్త కోసం పోరాటం చేసింది. ఈ క్రమంలో తనను అక్కడ నుంచి వెళ్లగొట్టేందుకు ఇంటి ముందు బియ్యం పిండితో ముగ్గు వేసి చీమలు వచ్చేలా చేస్తున్నారని సుహాసిని వాపోయింది. తనను ప్రేమ పేరుతో మోసం చేయడమే కాకుండా.. డబ్బులు కూడా తీసుకున్నాడని గతంలో సుహాసిని ఆరోపించింది.
అత్తింటి వారి వేధింపులు భరించలేక ఆత్మహత్య
suicide in huzuraabad: భర్తతోనే తన జీవితం కొనసాగించాలన్న ఉద్దేశంతో హుజూరాబాద్‌కు వచ్చి న్యాయం చేయాలని గత 40 రోజులుగా ఇంటి ముందు దీక్ష చేసింది. చివరకు తనను ఎవరూ పట్టించుకోకపోవడంతో బుధవారం విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. అది గమనించిన స్థానికులు వెంటనే వరంగల్ ఎంజీఎంకు యువతిని తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూసింది. తనను మోసం చేసిన సుజిత్ రెడ్డి వేరే అమ్మాయిని వివాహం చేసుకున్నాడని.. తన జీవితాన్ని నాశనం చేసిన భర్త, అత్త, మామలను కఠినంగా శిక్షించాలని కోరుతూ సూసైడ్ లెటర్ రాసింది.
అవయవాలను దానం చేయండి
లేఖలో తన అవయవాలను వేరే వారికి దానం చేయాలని పేర్కొంది. కరోనా కాటుకు తల్లిదండ్రులు బలికాగా.. ఇప్పడు తాను ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆస్పత్రిలో సుహాసిని చనిపోయిన సమాచారం తెలుసుకున్న భర్త, అత్తమామలు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. మృతురాలి సోదరుడికి పోలీసులు సమాచారం అందించారు. సూసైడ్ నోట్‌లో పేర్కొన్న అందరిపై కేసులు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.