Woman Cheats: 'డాలీ కీ డోలీ' సినిమా తరహాలో రంగారెడ్డిలో ఓ ఉదంతం వెలుగు చూసింది. ఈ సినిమాలో హీరోయిన్ ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఇంట్లో వారి అందరికీ స్వీట్ చేసి.. దానిలో మత్తుమందు కలుపుతుంది. అందరూ తిన్న తర్వాత.. ఆ ఇంట్లోని డబ్బు, నగలు తీసుకుని అక్కడి నుంచి ఉడాయిస్తుంది. ఇదే తరహాలో రంగారెడ్డి జిల్లాలోని యాచారం మండలంలో చోటు చేసుకుంది. మెట్టింటికి వచ్చిన కొత్త పెళ్లి కూతురు ఇంట్లోని నగదుతో పరారైంది.
వ్రతం కూడా చేసి..
40 ఏళ్ల బ్రహ్మచారికి ఎన్ని పెళ్లిసంబంధాలు వచ్చినా ఏదో ఒక వంకతో దాటవేస్తూ వచ్చాడు. దీంతో సంబంధాలు ఆగిపోయాయి. ఇటీవల పెళ్లి చేసుకోవాలనే కోరికతో ఓ మిత్రుడి సాయంతో మధ్యవర్తిని కలిశాడు. తనకు రూ.లక్ష ఇస్తే కుదిరిస్తానని అతను చెప్పడంతో ఆ మొత్తాన్ని చెల్లించాడు. ముందూ వెనుక ఎవరూ లేని ఓ అమ్మాయి ఉందని తనతో పాటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు వస్తే పెళ్లికి ఒప్పిస్తానన్నాడు. మిత్రుడితో కలిసి మధ్యవర్తితో కలిసి బెజవాడ వెళ్లిన అతను అమ్మాయిని చూసి ఓ లాడ్జిలో గురువారం పెళ్లి చేసుకున్నాడు. భార్యతో యాదగిరిగుట్టకు వచ్చి వ్రతం చేశారు. అనంతరం హైదరాబాద్‌లో షాపింగ్ చేశారు. 3 తులాల బంగారు గొలుసు, రూ.40 వేల దుస్తులు కొనుగోలు చేసి శుక్రవారం రాత్రి 8.30కి స్వగ్రామం చేరుకున్నారు.
ముఠా పథకమా?
Escape With Groom Money: ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే కొత్త పెళ్లికూతురు బీరువాలో దుస్తులు సర్దుతున్నట్లు నటించి అందులోని రూ.2 లక్షలు, కొత్త దుస్తులను తన బ్యాగులోకి మార్చుకుంది. ఆమెతోపాటు వచ్చిన మరో యువతి నగరంలోని తన సోదరుడిని కలవాల్సి ఉందని చెప్పి స్థానికంగా కారును అద్దెకు మాట్లాడి ఉంచింది. తలనొప్పి వస్తోందని మాత్రలు తెమ్మని భర్తని మందుల దుకాణానికి పంపింది. అతను వెళ్లగానే వారిద్దరు కారులో ఉడాయించారు. ఇంజాపూర్ సమీపంలోకి రాగానే ఇద్దరి వాలకం చూసి కారు డ్రైవర్ అవాక్కయ్యాడు. కారులోనే వారు దుస్తులు మార్చుకోవడం చూసి ఇదేంటని ప్రశ్నించగా అతన్ని బెదిరించారు. ఎల్బీనగర్ వద్ద కారుదిగి విజయవాడకు వెళ్లారు. బాధిత పెళ్లికొడుకు సోమవారం స్థానిక పెద్దలకు చెప్పడంతో విషయం బయటకు వచ్చింది. మధ్యవర్తిని నిలదీయగా ఆమె ఇంత పనిచేస్తుందని ఊహించలేదని అన్నట్లు సమాచారం. ఇదంతా ఓ ముఠా పథకం ప్రకారం చేసినట్లు భావిస్తున్నారు.
ఇదీ చూడండి: కిలేడి: పెళ్లి పేరుతో రూ.11 కోట్లు స్వాహా చేసిందిలా...!