woman caught thief in Rangareddy: సూర్యాపేట జిల్లా మోతె మండలం అప్పన్నగూడెం గ్రామానికి చెందిన సండ్ర శిరీష, నగేష్ దంపతులు హయత్‌నగర్ బొమ్మలగుడి సమీపంలోని బాలాజీనగర్ రోడ్డు నెంబర్.6లోని ప్లాట్‌నెంబర్ 182/5లో భిక్షమయ్య అనే వ్యక్తి ఇంటి మొదటి అంతస్తులో రెండునెలలుగా అద్దెకుంటున్నారు. పక్కనే మరో రెండు సింగిల్ బెడ్‌రూమ్‌లు ఖాళీగా ఉండడంతో ఇంటి యజమాని ఫోన్‌నెంబర్ సహా రాసిన టూ-లెట్ బోర్డును పెట్టాడు. అయితే ఇటీవల భిక్షమయ్య దంపతులు మధ్యప్రదేశ్‌లో ఉద్యోగం చేస్తున్న కుమారుడి వద్దకు వెళ్లారు.
గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి సరాసరి ఇంటి పైఅంతస్తుకు చేరుకొని అద్దెకు ఇళ్లు కావాలంటూ శిరీషను అడగడంతో యజమాని లేడంటూ బదులిచ్చింది. అయితే తాను ఫోన్ చేశానని ఇల్లు చూపించాలని చెప్పాడని అతను నమ్మకంగా చెప్పడంతో.. తొలుత ఒక ఫ్లాట్‌ను తర్వాత మరో ఫ్లాట్ చూపించి తాళం వేస్తుండగానే సదరు దొంగ అప్పటికే తనవెంట తెచ్చుకున్న కారాన్ని ఆమె కళ్లలో కొట్టి మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసును లాక్కొని కిందకు పరుగులు తీశాడు.
కళ్లలో కారం కొట్టినప్పటికీ మంట తట్టుకొని సమయస్ఫూర్తితో శిరీష ఆ దొంగను వెంబడించింది. కిందకు దిగిన దొంగ తన బైక్ ఎక్కి ముందుకు కదులుతుండగానే శిరీష బైక్‌ను గట్టిగా పట్టుకుంది. ఆమె వదలకపోవడంతో చోరుడు పది మీటర్ల మేర ఈడ్చుకెళ్లాడు. కాళ్లకు దెబ్బలు తాకినా సరే గట్టిగా కేకలు వేస్తూనే వదలకుండా బైక్‌ను వెనక్కు లాగడంతో నిందితుడు బైక్‌తో పాటు కిందపడ్డాడు. ఆ వెంటనే స్థానికంగా ఉండే ఓ ఇద్దరు యువకులతో కలిసి దొంగను పట్టుకుంది. బైక్ ఈడ్చుకెళ్లడంతో శిరీష మోకాళ్లకు గాయాలయ్యాయి.
దొంగను హయత్‌నగర్ పోలీసులకు అప్పగించారు. బంగారు గొలుసును స్వాధీనం చేసుకొని శిరీషకు అందజేశారు. నిందితుడి వద్ద నుంచి బైక్, అందులో ఉన్న కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చోరీ సమయంలో టీషర్టు ధరించిన దొంగ.. పని పూర్తికాగానే కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు వీలుగా వెంట మరో చొక్కా తెచ్చుకున్నాడు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.