Daughter attack on mother for assets : ఆస్తి కోసం కన్న తల్లిపైనే కూతురు, మనుమడు దాడి చేసిన ఘటన ఎస్సార్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. భర్త వదిలేసిన కూతురికి ఆశ్రయం కల్పించినందుకు... ఆస్తి కోసం ఆమె పిల్లలతో కలిసి దాడి చేసిందని వృద్ధురాలు నాగమ్మ( 70) పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనలో తనకు తీవ్ర గాయాలైనట్లు వాపోయింది. నాగమ్మకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. వృద్ధురాలు నాగమ్మ భర్త చనిపోయాడు. ఇద్దరు పిల్లల పెళ్లి చేసి... ఆమె ఒంటరిగా ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంకమ్మ బస్తీలో నివాసం ఉంటోంది. కొన్నాళ్ల తర్వాత కూతురు పార్వతిని ఆమె భర్త వదిలిలేశాడు. ఈ సమయంలో కూతురుని చేరదీసింది.
తల్లి పేరున ఉన్న ఆస్తిని వారి పేరుమీదకు మార్చాలని వృద్ధురాలి కూతురు పార్వతి, ఆమె పిల్లలు అడుగుతున్నారని నాగమ్మ ఫిర్యాదులో పేర్కొంది. ఆస్తుల పేపర్లపై సంతకాలు పెట్టాలని... లేదంటే చంపేస్తామంటూ బెదిరించారని చెప్పింది. రాడ్‌తో దాడి చేసినట్లు కన్నీరు పెట్టుకుంది.
'అన్నం పెడతా అని పెట్టలేదు. నేను అన్నం పెట్టు అని అడిగితే కాగితం రాయి అన్నది. నాకు అన్నం పెట్టనివారికి నేను రాయను అని అన్నాను. నేను సచ్చిపోయిన తర్వాత ఇస్తాను అని చెప్పిన. అయినా మా మనవడు, మనవరాలు, బిడ్డ నన్ను కొట్టారు.'
-నాగమ్మ, వృద్ధురాలు
తనపై దాడి చేసిన కూతురు, మనవడు, మనవరాలిపై వెంటనే చర్యలు తీసుకోవాలని నాగమ్మ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు..
ఇదీ చదవండి: isnapur family electrocuted incident : ఇస్నాపూర్ విద్యుదాఘాతం ఘటనలో మరొకరు మృతి