Car Accident at Jubilee hills: ఎమ్మెల్యే స్టిక్కర్‌తో ఉన్న ఓ కారు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో రెండున్నర నెలల పసికందు మృతిచెందగా ఏడాది వయసున్న బాలుడితో పాటు ముగ్గురు మహిళలు గాయపడ్డారు.
అదుపు తప్పి.. దూసుకెళ్లి
గురువారం రాత్రి 9 గంటల సమయంలో మాదాపూర్ నుంచి టీఆర్ నంబరుతో ఉన్న వాహనం దుర్గం చెరువు తీగల వంతెన మీదుగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు 45లోని బ్రిడ్జిని దాటి, రోడ్ నెంబరు 1/45 కూడలి వైపు వేగంగా వస్తోందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ క్రమంలో బ్రిడ్జి దిగగానే ఒక్కసారిగా అదుపు తప్పినట్లు పేర్కొన్నారు. అక్కడే పిల్లలను ఎత్తుకొని బుడగలు విక్రయిస్తున్న మహారాష్ట్రకు చెందిన కాజల్‌చౌహాన్, సారిక చౌహాన్, సుష్మ భోంస్లేలను కారు ఢీకొట్టిందని వెల్లడించారు. దీంతో కాజల్ చౌహాన్ చేతిలో ఉన్న రెండున్నర నెలల పసికందు రణవీర్ చౌహాన్, సారిక చౌహాన్ చేతుల్లో ఉన్న ఏడాది వయసున్న అశ్వతోష్ సైతం కిందపడ్డారని వివరించారు.
పరారీలో డ్రైవర్
ప్రమాదంలో రణవీర్ చౌహాన్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. మహిళలకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ వాహనాన్ని వదిలేసి రోడ్ నెంబరు 1 వైపు పరారయ్యాడు. క్షతగాత్రులను స్థానికులు, ట్రాఫిక్ పోలీసులు 108లో జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. చిన్నారి రణవీర్‌చౌహాన్ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధరించారు.
ఎమ్మెల్యే పేరుతో స్టిక్కర్
కారుపై బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ మహమ్మద్ పేరుతో స్టిక్కర్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే కారును ఎవరు నడిపించారు? ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిర్మాణ సంస్థ పేరిట కారు రిజిస్ట్రేషన్ అయినట్లు గుర్తించారు. పరారైన డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి: Holi Tips: హోలీ వేడుకలకు వెళ్తున్నారా.. ఇవి తప్పనిసరి!