ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి ఐదుగురు మృతిచెందారు. తర్లుపాడు మండలం రోలుగుంపాడు ఎస్టీ కాలనీ వద్ద ఒంగోలు- కర్నూలు రహదారిలో ఈ ఘటన జరిగింది. రోడ్డుపై పడి ఉన్న గేదె కళేబరంపై ఆటో ఎక్కడంతో అది బోల్తా పడింది. దీంతో ఐదుగురు మృతిచెందగా, మరికొందరు గాయపడ్డారు.
వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతిచెందిన వారు దర్శి గ్రామానికి చెందిన పొట్లపాటి సారమ్మ, గొంగటి మార్తమ్మ, ఇత్తడి లింగమ్మ, కోటమ్మ, ఆటో డ్రైవర్ వేంకటేశ్వరరెడ్డిగా గుర్తించారు. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 14 మంది ప్రయాణికులు ఉన్నారు.
బెస్తవారిపేట మండలం కొత్తపల్లిలో కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. చీకట్లో రోడ్డు మీద పడి ఉన్న గేదె కళేబరాన్ని డ్రైవర్ గుర్తించకపోవడం వల్లనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి: కాబుల్‌లో ఉగ్ర కుట్ర భగ్నం.. ముగ్గురు చిన్నారులు మృతి