Student Suicide: "జీవితం ఓ వరం. పోతే తిరిగి పొందలేని అద్భుత అవకాశం." ఈ విషయాన్ని చాలా మంది విద్యార్థులు, యువత మర్చిపోతున్నారు. చిన్నచిన్న కారణాలకే నిండు జీవితాలను తృణప్రాయంగా తీసుకుంటున్నారు. అందులోనూ.. జీవం లేని వస్తువుల కోసం విలువైన ప్రాణాలను వెలకడుతున్నారు. అలాంటి ఓ అనాలోచిత నిర్ణయంతో బంగారు భవిష్యత్తును కాలరాసుకున్నాడు ఓ పదో తరగతి విద్యార్థి. కుటుంబం తన మీద పెట్టుకున్న ఆశలు, నమ్మకం, భవిష్యత్తు.. వీటన్నింటి గురించి ఏమాత్రం ఆలోచించకుండా ప్రాణాలు తీసుకుని.. తన జీవితం విలువ కేవలం ఓ సెల్ఫోన్ అని నిర్ణయించుకున్నాడు.
ములుగు జిల్లా వాజేడు మండలంలోని ప్రగళ్లపల్లికి చెందిన పాయం సాయి లిఖిత్.. ఇటీవలే పదో తరగతి పరీక్షలు రాశాడు. ఇంకేముంది.. పాఠశాల కట్టడి జీవితం అయిపోయిందన్న ఆనందం.. త్వరలోనే కాలేజీలో చేరబోతున్నానన్న ఉత్సాహం.. లిఖిత్ను గాల్లో తేలియాడేలా చేసింది. అప్పుడే పెద్దవాన్నయిపోయాననే భావన అతనిలో మొదలైంది. స్నేహితులందరి చేతుల్లో సెల్ఫోన్లు ఉండటం చూసి.. తాను వాడాలన్న కోరిక మొదలైంది. తనకూ ఓ మొబైల్ కొనివ్వాలని సోమవారం(మే 30) రోజున ఇంట్లో అడిగాడు. ఇప్పుడే ఎందుకు తర్వాత చూద్దాంలే అని ఇంట్లోవాళ్లు నచ్చజెప్పగా.. కొనివ్వాల్సిందేనని గొడవ చేశాడు. సెల్ఫోన్ కొనిచ్చే స్థోమత లేదని తల్లి సుశీల కొడుకును మందలించడంతో అలిగి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు.
కోపం పోయాక తనే వస్తాడులే అనుకున్న కుటుంబీకులకు ఎదురుచూపులే మిగిలాయి. ఎంతసేపటికీ లిఖిత్ ఇంటికి రాకపోవటంతో.. తెలిసినవాళ్లతో పాటు బంధువుల ఇళ్లలో వెతికినా లాభం లేకుండా పోయింది. కాగా.. రెండు రోజుల తర్వాత ఈరోజు(జూన్ 1) ఉదయం పాలెం ప్రాజెక్టులో బాలుడి మృతదేహం ఉందని సమాచారం అందటంతో.. కుటుంబసభ్యులు వెళ్లి పరిశీలించారు. ఆ మృతదేహం లిఖిత్దే కావటంతో..కుటుంబసభ్యులు బోరుమన్నారు. కాగా.. లిఖిత్ తండ్రి ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ.. గతేాడాదే అనారోగ్యంతో మృతి చెందాడు. ఇప్పుడు కుమారుడు కూడా మృతి చెందటంతో.. వారు శోకసంద్రంలో మునిగిపోయారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: