Student Died in school: హైదరాబాద్ కృష్ణానగర్‌లో విషాదం చోటుచేసుకుంది. పాఠశాలలో పేపర్ బాల్‌తో క్రికెట్ ఆడుతున్న విద్యార్థుల మధ్య జరిగిన గొడవ ఒకరిని బలితీసుకుంది. కృష్ణానగర్‌లోని సాయికృప పాఠశాలలో పదో తరగతి విద్యార్థులు క్లాస్‌రూంలో సరదాగా పేపర్‌తో క్రికెట్ ఆడుతున్నారు. ఈ క్రమంలో నలుగురు విద్యార్థుల మధ్య వివాదం తలెత్తింది. కోపంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో మన్సూర్ అనే విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి గమనించి వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు.. మన్సూర్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు. ఈ ఘటనకు పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే మన్సూర్ చనిపోయాడని ఆరోపించారు. పాఠశాలలో మన్సూర్ బంధువులు ఆందోళనకు దిగారు.
ఇది యాజమాన్యం నిర్లక్ష్యమే..
"మన్సూర్ కిందపడి చనిపోలేదు. లోపల.. పిల్లల మధ్య స్ట్రీట్ ఫైట్ జరిగింది. పిల్లలు కొట్టుకుంటుంటే టీచర్లు ఏం చేస్తున్నారు..? రోజు గొడవలు పడుతూనే ఉంటారు.. ఎంతని చెప్తామని సార్లు అంటున్నారు. గొడవలు పడితే చెప్పాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే కదా. ఇదంతా జరగడానికి కారణం.. పాఠశాల యాజమాన్య నిర్లక్ష్యమే. మన్సూర్ చాలా మంచివాడు. మాకు న్యాయం కావాలి." - రఫీ, మన్సూర్ బాబాయ్
తోటి విద్యార్థులు ఏం చెబుతున్నారంటే..
సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు... ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. తరగతి గది సీసీటీవీ దృశ్యాలు పరిశీలించారు. సహచర విద్యార్థులను ఆరా తీశారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో మన్సూర్.. స్నేహితులతో కలిసి క్లాస్‌రూంలో పేపర్‌తో క్రికెట్ ఆడారని తెలిపారు. వాళ్ల మధ్య జరిగిన వాగ్వాదం కారణంగా.. ఒకరినొకరు తోసుకున్నారని చెప్పారు. ఈ తోపులాటలో మన్సూర్ ఒక్కసారిగా కిందపడిపోయి తిరిగి లేవలేదని.. వెంటనే ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకువెళ్లామని స్నేహితులు వివరించారు.
అసలు గొడవే జరగలేదు..
తరగతి గదిలో విద్యార్థుల మధ్య అసలు గొడవే జరగలేదని ప్రిన్సిపాల్ అంజనీరావు తెలిపారు. మంజూరు కిందపడిన విషయాన్ని తెలుసుకున్న వెంటనే.. అతని వద్దకు వెళ్లి మంచినీళ్లు తాగించామని వివరించారు. నీరసంగా ఉందని చెప్పడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లామన్నారు. అక్కడి నుంచి మన్సూర్ తల్లిదండ్రులు అపోలో ఆస్పత్రికి తీసుకువెళ్లారని తెలిపారు. తరగతి గదిలో ఉన్న సీసీ కెమెరాల్లో కూడా విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగినట్లు నమోదు కాలేదని స్పష్టం చేశారు.
ఎవరి నిర్లక్ష్యం ఉన్నా కఠిన చర్యలు..
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ తెలిపారు. విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగిందో లేదో తెలుసుకుంటామన్నారు. తరగతి గదిలో మన్సూర్ స్పృహ తప్పి పడిపోయాడన్న ఆయన... ఆస్పత్రికి తరలించే సమయానికే చనిపోయాడని స్పష్టం చేశారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఎవరి నిర్లక్ష్యం ఉన్నా కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
"పిల్లలంతా మైనర్లే. వాళ్ల మధ్యలో ఏముంటుంది..? ఏ విషయంలో గొడవ పడ్డారో.. అసలు గొడవ జరిగిందో లేదో కూడా తెలుసుకుంటాం. ఇందులో ఎవరి నిర్లక్ష్యం ఉందో దర్యాప్తు చేస్తున్నాం. ఎవ్వరిది తప్పున్నా.. కఠిన చర్యలు తీసుకుంటాం." - సుదర్శన్, బంజారాహిల్స్ ఏసీపీ
విద్యాబుద్ధులు నేర్చుకుని ప్రయోజకుడవుతాడనుకున్న కుమారుడు పాఠశాలలోనే కన్నుమూయటాన్ని చూసి తల్లిదండ్రులు గుండలవిసేలా రోధిస్తున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల విద్యార్థుల గొడవల్లో తమ పిల్లాడు మృతి చెందాడని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: