వరంగల్ బెస్తం చెరువు వైశాల్యం.. 118 ఎకరాలు. ఉర్సు చెరువు విస్తీర్ణం.. 126 ఎకరాలు. చాలా పెద్ద చెరువులు కదా! కాకపోతే.. ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడా చెరువులు చిన్నబోయాయి. తనువు చిన్నగా చేసుకొని 30, 40 ఎకరాలకు కుంచించుకుపోయాయి. కాదు.. కాదు.. ఆక్రమణదారుల చెరలో చిక్కి.. చిన్నవైపోయాయి. చెరువు కింద పారే నాలాలు సైతం ఆక్రమణలకు గురై.. దారి తప్పి కాలనీల్లోకి ప్రవహిస్తున్నాయి.
చెరువులు, నాలాల ఆక్రమణ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో... వరంగల్ నగర వాసులు గత నెలలో ప్రత్యక్షంగా చవి చూశారు. పది రోజులు పాటు కురుసిన కుండపోత వర్షాలు నగరం జలమైయపోయింది. చెరువులు, కుంటలు, నాలాలు పొంగిపొర్లడంతో... నగరం నడిబొడ్డున ఉన్న కాలనీలు సైతం నీట మునిగి.. ముంపు ప్రాంతాలను తలపించాయి. వరద నీరు వెళ్లిపోయే దారి లేక... వందకుపైగా కాలనీలు నీట మునిగాయి. ప్రాణనష్టం సంభవించలేదు కానీ... నగరవాసులకు మాత్రం కంటిమీద కనుకు లేకుండా చేసింది. బియ్యం, పప్పు, ఊప్పు.. ఇతర సామగ్రి అంతా తడిసి ముద్దయ్యాయి. విపత్తు నిర్వహణ బృందాలు పడవలేసుకుని మరీ సహాయక చర్యలు చేపట్టాయి.
బేలగా చూస్తున్న బెస్తం చెరువు..
చెరువులు నాలాల ఆక్రమణల ఫలితంగా... నగరానికి గతంలో ఎప్పుడూ లేనంత వరద ముంపు సమస్య ఏర్పడింది. వరంగల్ పట్టణ పరిధిలో మొత్తం 247 చెరువులుండాలి. ఇందులో ఇప్పటికే 52 చెరువులను ఆక్రమణదారుల కన్నుల్లో పడి గల్లంతైయ్యాయి. మిగిలిన చెరువులను కబ్జాదారులు కబళించాలని చూస్తున్నారు. ఖిలా వరంగల్ మండలం తిమ్మాపూర్ శివారులోని బెస్తం చెరువు నానాటికీ కుంచించుకుపోతోంది. రికార్డుల ప్రకారం చెరువు విస్తీర్ణం 118 ఎకరాలు ఉంటే... అదిప్పుడు 40 ఎకరాలకు చేరింది. చెరువు చుట్టూ ఉన్న భూములన్నీ ప్లాట్లుగా... మారి జనావాసాలయ్యాయి. ఈ చెరువు నిండి మత్తడి పోస్తే.. రంగశాయి పేట, మద్దెలకుంట నుంచి వరదనీరు ఉర్సు చెరువుకు వస్తుంది. కానీ నీరు పారే... నాలాలను కూడా కబ్జాదారులు ఆక్రమించారు. మొన్న వచ్చిన వానలకు వరదనీరు పోయే మార్గం లేక... సమీపంలోని రైతుల పొలాలు నీట మునిగాయి. సత్యసాయినగర్, పెట్రోల్ పంప్ వరకు వరద నీరు చేరింది. విషయం అర్థమైన స్థానికులు చెరువు ఆక్రమణలు తొలగించాలని... నాలాలను విస్తరించాలని అధికారులను కోరుతున్నారు.
ఉర్సు చెరువు ఉస్సురుమంటోంది!
వరంగల్ నగరంలోని కరీమాబాద్ ఉర్సు చెరువుదీ సేమ్ కథ. చెరువు మొత్తం విస్తీర్ణం 126 ఎకరాలు. కానీ.. కబ్జాదారుల ఆక్రమణలకు బలై.. చిక్కి శల్యమై.. 30 ఎకరాలకు తగ్గిపోయింది. మత్తడి పారే నాలా సైతం ఆక్రమణకు గురైంది. చెరువు చుట్టూ... ప్లాట్లు వెలిశాయి. మత్తడి నీరు వెళ్లి పోయే మార్గం లేక.. బీఆర్ నగర్, రాజీవ్ గృహకల్ప, ఎస్ఆర్ తోట, ఉర్సు గుట్ట కోట ప్రాంతాల్లోకి వరద నీరు చేరి.. ఆయా ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. కడిపికొండ వంద అడుగుల రోడ్డు, జేఎస్ఎం స్కూల్ వెనక భాగం, ఎస్ఆర్ తోట వైపు ఉండే నాలాలు ఆక్రమణలకు గురి కావడం వల్ల.. వరద నీళ్లన్నీ.. కాలనీలకు పరుగులు పెట్టాయి. చెరువులను ఆక్రమించి ప్లాట్లు కడుతూ.. కాలనీలుగా మారుస్తున్నా.. నాలాల మీద అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా.. అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు మండి పడుతున్నారు. మొన్నటి వరదలతో జిల్లా యంత్రాంగం కళ్లు తెరుచుకున్నాయి. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పడ్డ టాస్క్ఫోర్స్ కమిటీ నాలాల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతూ నయీం నగర్, బొందివాగు పరిసర ప్రాంతాల్లోని అక్రమ కట్టడాలను తొలగిస్తున్నారు. నగర శివారులో మిగతా చెరువుల చుట్టూ ఉన్న... ఆక్రమణలకు కూడా అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చూడండి : నూతన రెవెన్యూ బిల్లుకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం