రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే కరోనా వైరస్ గ్రామాలకు విస్తరించిందని మండి పడ్డారు. కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తే... 45 శాతం పాజిటివ్ కేసులు వస్తున్నాయని తెలిపారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్... ఫామ్ హౌస్ వదిలి బయటకు వచ్చి ఆరోగ్యశాఖతో సమీక్షాసమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు.
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించిన భట్టి... ఆసుపత్రిలో సగం పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. ఉన్న కొద్దిపాటి వైద్యులే... పేద ప్రజలకు ప్రాణం పోస్తున్నారని తెలిపారు. కొవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. అరకొర సౌకర్యాలతో వైద్యులు, సిబ్బంది సేవలు చేస్తున్నారని... వారి సేవలు మరువలేనివని కొనియాడారు. వైద్యులకు, సిబ్బందికి భట్టి కృతజ్ఞతలు తెలిపారు.