రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటైన......వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంబ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ముచ్చటైన స్వాగత తోరణాలతో మల్లన్న ఆలయం చూపరులను ఆకట్టుకుంటుంది. ప్రకృతి రమణీయత, అద్భుత శిల్పసంపదతో సువిశాల ప్రాంగణంలో వందల ఏళ్ల క్రితం ఆలయం నిర్మితమైంది. ఏటా సంక్రాంతి నుంచి ఉగాది వరకు ఇక్కడ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. రాష్ట్రంలోతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. ఇటీవలే సమీక్ష నిర్వహించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పనులు వేగవంతం చేయాలని ఆదేశించడంతో అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేశారు.
నేటి నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాల్లో భాగంగా... 14న బండ్లు తిరుగుట, 16న మహాసంప్రోక్ష సమారాధన, ఫిబ్రవరి 2న భ్రమరాంబిక అమ్మవారి వార్షికోత్సవం, 17న రేణుకా ఎల్లమ్మ పండుగ, మార్చి 9 నుంచి 13 వరకు శివరాత్రి కల్యాణ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఏప్రిల్ 13న ఉగాదితో.... ఉత్సవాలు ముగుస్తాయి. జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ అధికారులు తెలిపారు. కరోనా దృష్ట్యా అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నామని వెల్లడించారు. క్యూలైన్లలో థర్మల్ స్క్రీనింగ్ చేసి... శానిటైజర్, మాస్క్ పంపిణీ చేస్తామని ఈవో తెలిపారు.
లక్షలాదిమంది తరలివచ్చే మల్లికార్జునస్వామి జాతరకు పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. 400 పైగా సిబ్బంది జాతరలో విధులు నిర్వర్తించనున్నారు. జాతరకు వచ్చే ప్రధానదారులన్నింటినీ CC కెమెరాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు స్వామివారిని దర్శించుకోవాలని ఆలయ అధికారులు తెలిపారు. జాతరలో అనుమాస్పద వ్యక్తులు కనబడితే సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.
ఇదీ చూడండి: ఈ నెల 13 నుంచి 17 వరకు జాతీయ పారామోటార్ ఛాంపియన్ షిప్ పోటీలు