నిజాంసాగర్ ఆయకట్టు కోసం మరో పునరుజ్జీవ పథకానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కాళేశ్వరం ద్వారా మళ్లించే నీటితో చేపట్టిన శ్రీరామ్‌సాగర్ పునరుజ్జీవ పథకం పూర్తి కావొస్తుండగా.. నిజాంసాగర్ పునరుజ్జీవం పేరుతో మరో పథకానికి విశ్రాంత ఇంజినీర్ల సంఘం నివేదికను తయారు చేసి నీటిపారుదల శాఖకు అందజేసింది. ఈ పథకానికి సుమారు రూ.500 కోట్ల వ్యయమవుతుందని ప్రాథమిక అంచనా. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇటీవల విశ్రాంత ఇంజినీర్లతో చర్చించిన తర్వాత కొత్త ప్రతిపాదన ముందుకొచ్చింది.
ఎస్సారెస్పీ ద్వారానే నిజాంసాగర్ ఆయకట్టుకు నీరు..
ఈ ఏడాది అన్ని ప్రాజెక్టులు పొంగి ప్రవహించినా సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్టుల్లోకి నీళ్లు రాలేదు. ఈ నేపథ్యంలో కొత్త ప్రతిపాదన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా రోజుకు ఒక టీఎంసీ నీటిని మళ్లిస్తున్నందున.. ఈ నీటినే నిజాంసాగర్ ఆయకట్టుకు కూడా ఇవ్వొచ్చని విశ్రాంత ఇంజినీర్లు నివేదించారు. కాళేశ్వరంలో భాగంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నాలుగన్నర లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు మూడు ప్యాకేజీల పనులు చేపట్టారు.
త్వరలో నిర్ణయం..
ఇందులో 20వ ప్యాకేజీ నుంచి 2,500 క్యూసెక్కుల నీటిని నిజాంసాగర్ ప్రధాన కాలువ ద్వారా అలీసాగర్ దిగువన ఆయకట్టుకు సరఫరా చేసేలా పనులు చేపట్టారు. మూడు పంపింగ్ స్టేషన్లు ఉండగా.. ఒక దాని నుంచి నిజాంసాగర్‌కు నీటిని మళ్లించేలా ప్రతిపాదించారు. ఈ పథకానికి అదనంగా చేపట్టే విద్యుత్తు పనులకు రూ.275 కోట్లవుతుందని.. మొత్తమ్మీద రూ.500 కోట్లు ఖర్చవుతుందని విశ్రాంత ఇంజినీర్లు నివేదించారు. ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాత దీనిపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశముందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇవీ చూడండి: ఎస్సారెస్పీ జలాలు ఎక్కువై.. నీట మునిగిన పంట పొలాలు