భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీద తెరాస నేతలు చేసిన వ్యాఖల పట్ల నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారసత్వ రాజకీయాలు చేస్తున్న సీఎం కేసీఆర్కు భాజపా గురించి మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. మంత్రి కేటీఆర్‌కు ఏ అర్హత ఉందని సీఎంని చేస్తారని అర్వింద్ ప్రశ్నించారు. మైనింగ్ కేసులో కేసీఆర్, కుటుంబసభ్యులకు జైలుకు వెళ్లటం ఖాయమని అర్వింద్ జోస్యం చెప్పారు. తరుణ్ చుగ్ గురించి మాట్లాడే అర్హత తెరాస నేతలకు లేదని మండిపడ్డారు.
దేశ ద్రోహులతో చేతులు కలిపిన పార్టీ తెరాస అని అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ హిందుత్వాన్ని ప్రశ్నించే అర్హత ఆ పార్టీకి లేదని స్పష్టం చేశారు. చాయ్ అమ్ముకునే స్థాయి నుంచి ప్రపంచానికి దిశానిర్దేశం చేసే ఎత్తుకు ఎదిగిన ప్రధాని మోదీని విమర్శించటం తెరాస నేతలకు తగదని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో భాజపా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెరాస రెండంకెల సంఖ్య దాటదని జోస్యం చెప్పారు.