అసలే ఈ మధ్య పులుల సంచారం పెరిగింది. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల ప్రజలు ప్రాణభయంతో వణికిపోతున్నారు. దీనికి తోడు జనావాసాల సమీపంలో పులిపిల్లల జాడలు దొరుకుతుండడం మరింత కలవర పెడుతోంది.
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని భవానీపేట గ్రామ సమీపంలోని ఓ చెట్టు తొర్రలో చిరుత పిల్ల దొరికింది. భవానిపేట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం గ్రామ సరిహద్దులో ఉన్న ఓ కాలువ దగ్గరికి వెళ్లాడు. ఇసుక తవ్వుతుండగా పిల్లి అరిచినట్టుగా శబ్దాలు వచ్చాయి. కాస్త పరిశీలించి చూడగా.. ఓ చెట్టు తొర్రలో చిరుత పులి పిల్లలు కనిపించాయి. దాని లక్షణాలు చిరుతపులిలా అనుమానించిన గ్రామస్థులు వెంటనే అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. వెంటనే అధికారులు అక్కడికి చేరుకుని చిరుతపులి పిల్లగా నిర్ధారించి హైదరాబాద్ జంతు ప్రదర్శనశాలకు తరలించారు.
గ్రామానికి సమీపంలోని చెట్టు తొర్రలో చిరుత పిల్ల దొరకడం పట్ల గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుత పిల్ల దొరికిన మోడువారిన చెట్టు భవానీపేటకు చెందిన కత్తుల కృష్ణమూర్తి పొలం సమీపంలో జరిగింది. ఆ దారిలో పొలాలకు వెళ్లాలంటేనే గ్రామస్థులు, కూలీలు, రైతులు చిరుత భయంతో వణికిపోతున్నారు.