devotees trouble in Yadadri: యాదాద్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సీఎం యాదాద్రిలో పర్యటించి, తిరిగి వీవీఐపీ కాటేజీలకు వెళ్లే వరకు సుమారు మూడున్నర గంటల పాటు భక్తులకు దర్శనాలు నిలిపివేశారు. అలాగే ప్రసాదాలు, కొండపైకి ఆర్టీసీ బస్సుల రాకపోకలు తాత్కాలికంగా బంద్ చేశారు. భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి వేచి ఉండే వసతులను సైతం మూసివేశారు.
క్షేత్ర సందర్శనకు తమ కుటుంబసభ్యులతో వచ్చిన భక్తులకు అనేక సమస్యలు దర్శనమిచ్చాయి. ఆలయ పరిసరాల్లో భక్తులకు ఆలయ అధికారులు అనుమతిని నిలిపివేశారు. భక్తులు నీటి వసతికి, ఆహారవసతికి, కొండపైకి రవాణా వసతి లేక అనేక ఇబ్బందులుపడ్డారు. ఆలయ అధికారులు సీఎం పర్యటనకు వస్తారని తెలిసినా.. భక్తులకు కావలసిన వసతి సౌకర్యాలు ముందుగా చేపట్టలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేచి ఉండేందుకు సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డామని తెలిపారు. కనీసం సౌకర్యాలు సైతం ఏమీలేవని వారి గోడును చెప్పుకున్నారు. మహిళలు, చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బంది పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ యాద్రాద్రి పర్యటన.. సీఎం కేసీఆర్ యాదాద్రిలో పర్యటించారు. కుటుంబసమేతంగా యాదాద్రికి వచ్చిన కేసీఆర్‌కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్ దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. బంగారు తాపడం కోసం విరాళం అందించారు. కిలో 16 తులాల బంగారాన్ని స్వామివారికి కానుకగా ఇచ్చారు. పూజల్లో కేసీఆర్ దంపతులతో పాటు మనువడు హిమాన్షు, మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
అంతకుముందు రోడ్డు మార్గం ద్వారా ప్రత్యేక బస్సులో యాదాద్రికి చేరుకున్న కేసీఆర్.. బస్సులోనే కొండ చుట్టూ ప్రదక్షిణ చేసి ప్రెసిడెన్షియల్ సూట్ చేరుకున్నారు. ప్రెసిడెన్షియల్ సూట్స్‌లో వివిధ శాఖల అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. సుమారు గంట పాటు అధికారులతో సీఎం సమావేశం కొనసాగింది.
ఇవీ చదవండి: