నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం కన్నెకల్ గ్రామంలో వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉందని పేర్కొంటూ స్థానికుడు ఉపేందర్ రెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. గ్రామంలో ఇప్పటివరకు 26 మంది వీధికుక్కల బారిన పడ్డారని.. ఐదు జంతువులు చనిపోయాయని పిటిషనర్ పేర్కొన్నారు.
రేబీస్ వ్యాక్సిన్ కోసం పది కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోందని.. ప్రస్తుతం కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో అలా వెళ్లడం ఇబ్బందికరంగా ఉందని తెలిపారు. స్పందించిన ధర్మాసనం.. గ్రామంలో హోమియోపతి ఆసుపత్రిలో రేబీస్ వ్యాక్సిన్‌తో పాటు వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామంలో వీధి కుక్కల బెడద నియంత్రణకు చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శిని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ సమస్యపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని అధికారులను ఆదేశించింది.
ఇదీ చూడండి:- ఆ పేలుడుకు అణుబాంబులో ఐదోవంతు శక్తి..!